Vijay Varasudu Movie Controversy: తెలుగు, తమిళ పరిశ్రమల మధ్య ‘వారసుడు’ చిచ్చు పెట్టినట్లయింది. తమిళ హీరో విజయ్ నటించిన ఈ సినిమా రిలీజ్ పై రెండు ఇండస్ట్రీల మధ్య వివాదం ముదురుతోంది. ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. కొన్ని చిన్న సినిమాలను సైతం ఒకటి, రెండు రోజుల తేడాతో అదే పండుగకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి తమిళ సినిమా ‘వారసుడు’ను కూడా రిలీజ్ చేయాలని ముందుగా డేట్ ఫిక్స్ చేశారు. కానీ ఈ సంక్రాంతికి తమిళ సినిమాల రిలీజ్ కు అనుమతి లేదని తెలుగు సినిమా నిర్మాతల మండలి తీర్మానించింది. దీంతో ‘వారసుడు’కు బ్రేక్ పడినట్లయింది. ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. తమిళనాడులోని నిర్మాత మండల ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము కూడా తెలుగు సినిమాలను ఆపుతామని హెచ్చరిస్తోంది.

తమిళ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు సంక్రాంతి సందర్భంగా సినిమాను తెచ్చేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ఆయనకున్న పరపతితో థియేటర్లను ముందే బుక్ చేసుకున్నారు. అయితే ఇదే ఫెస్టివల్ కు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’.. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ని రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని లైన్ లో ఉన్నాయి. అయితే తెలుగు సినిమాలకు సంక్రాంతి పండుగ పెద్ద దిక్కు. ఈ సమయంలో రిలీజ్ చేసిన సినిమాలు ఎంతో కొంత వసూలవుతాయి. కానీ దిల్ రాజు రిలీజ్ చేసే ‘వారసుడు’తో తమకు థియేటర్లు దొరకడం లేదని కొందరు నిర్మాతలు ఆందోళన చేశారు.
ఈ నేపథ్యంలో ఇటీవల తెలుగు నిర్మాతల మండలి భేటీ అయింది. ఈ సంక్రాంతికి తమిళ సినిమాలను రిలీజ్ చేయొద్దని తీర్మానించింది. దీంతో ‘వారసుడు’ సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ‘వారసుడు’ రిలీజ్ ను అడ్డుకోవడంపై తమిళ సినీ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము కూడా ఇక్కడ తెలుగు సినిమాలను అడ్డుకుంటామని కొందరు హెచ్చరిస్తున్నారు. మేం తెలుగు సినిమాలను ఆదరిస్తుంటే.. తమిళ సినిమాలను ఆపడం ఏంటని.. వారు ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 22న తమిళ నిర్మాత మండలి భేటీ కానుంది.

ఈ భేటీలో తెలుగు సినిమాలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి వివాదమైనా ముందుకు వచ్చి మాట్లాడే దిల్ రాజు ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఒకవేళ తమిళ సినీ పరిశ్రమ తెలుగు సినిమాలను ఆపితే పెద్ద వివాదమే తలెత్తే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ తమిళులకు బిగ్ ఫెస్టివలే. అందుకే ‘వారసుడు’ను సంక్రాంతికి అడ్డుకోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.