Ustaad Bhagat Singh Teaser: పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ లది బ్లాక్ బస్టర్ కాంబో. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడన్న విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి చిత్రం చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కొంత మేర షూటింగ్ జరుపుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది.
కాగా నేడు ఉస్తాద్ భగత్ సింగ్ నుండి టీజర్ విడుదల చేశారు. భగత్స్ బ్లేజ్ పేరుతో విడుదలైన టీజర్ నిమిషం నిడివి కలిగి ఉంది. హరీష్ శంకర్ మార్క్ విజువల్స్ మనం చూడవచ్చు. రూత్ లెస్ పోలీస్ గా పవన్ కళ్యాణ్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై వీర విహారం చేయడం ఖాయం. హరీష్ శంకర్ పవన్ క్యారెక్టరైజేషన్ ఓ రేంజ్ లో తీర్చిదిద్దాడని అర్థం అవుతుంది. మత ఘర్షణలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్లో చూపించారు.
ఇక పవన్ కళ్యాణ్ పొలిటికల్ పంచ్లు టీజర్ కి హైలెట్ అని చెప్పాలి. ఏపీ సీఎం జగన్ టార్గెట్ గా ఆయన డైలాగ్స్ ఉన్నాయి. పగిలిపోయిన గ్లాసు మరింత పదునెక్కుతుందని… పవన్ కళ్యాణ్ ఓ సన్నివేశంలో చెప్పాడు. ఇది గత ఎన్నికల ఓటమిపై పవన్ కళ్యాణ్ వేసిన సెటైర్ అని అర్థం అవుతుంది. ఓటమితో కృంగిపోము మరింత బలంగా వస్తామని ఆ డైలాగ్ తో ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు.
మరో డైలాగ్ లో ‘కచ్చితంగా గుర్తు పెట్టుకో… గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం, కనిపించని సైన్యం’ అని చెప్పాడు. ఇది జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు గురించి చెప్పిన మాట. మొత్తంగా పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ ప్రత్యర్థులకు ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ పంచ్ డైలాగ్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనడంలో సందేహం లేదు. దేవిశ్రీ ప్రసాద్ బీజీఎం ఆకట్టుకుంది. టీజర్లో శ్రీలీల జస్ట్ అలా కనిపించింది. మొత్తంగా పవన్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతోందని లేటెస్ట్ టీజర్ చూస్తే అర్థం అవుతుంది.