Homeఎంటర్టైన్మెంట్US Presidential Elections: ట్రంప్ తేలిపాయే.. పదునైన మాటలతో ప్రత్యర్థికి చుక్కలు.. డిబేట్‌లో ఆధిపత్యం కనబర్చిన...

US Presidential Elections: ట్రంప్ తేలిపాయే.. పదునైన మాటలతో ప్రత్యర్థికి చుక్కలు.. డిబేట్‌లో ఆధిపత్యం కనబర్చిన కమల!

US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా అధ్యక్ష అభ్యర్థుల మధ్య మంగళవారం రాత్రి డిబేట్‌ జరిగింది. ఇందులో అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్ప్‌ చిరునవ్వుతోనే చెలరేగిపోయారు. ఫిలడెల్ఫియాలో జరిగిన చర్చావేదికలో పలు అంశాలపై విస్పష్ట వైఖరిని ప్రదర్శించారు. అబార్షన్, ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై గట్టి వాణిని వినిపించారు. రిపబ్లికన్‌ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆమె గుక్కతిప్పుకోనీయలేదు. ఆద్యంతం సీరియస్‌గా వ్యవహరించిన ఆయన గట్టిగా స్పందించలేక చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. హారిస్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. సలహాదారులు వారిస్తున్నా ఆయన పట్టించుకోలేదు. దీంతో చర్చలో కమలదే పైచేయి అయింది. 90 నిమిషాలపాటు జరిగిన అధ్యక్ష అభ్యర్థుల చర్చలో హారిస్‌ మాటల తూటాలకు ట్రంప్‌ అవాక్కయ్యారు. బుధవారం అలబామాలో బ్యాలెట్ల ఈ మెయిల్స్‌ పంపిణీ ప్రారంభమైన ఒక రోజు ముందు జరిగిన ఈ చర్చలో హారిస్‌.. అమెరికన్ల మనసు చూరగొన్నారు. డిబేట్‌ కోసం ప్రత్యర్థులిద్దరూ ఏబీసీ వేదికపైకి రాగానే హారిసే చొరవ తీసుకుని ట్రంప్‌ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. తద్వారా ముందే పైచేయి సాధించారు. డిబేట్‌ చక్కగా సాగాలని ఆమె ఆకాంక్షించగా, ’హావ్‌ ఫన్‌’ అంటూ ట్రంప్‌ స్పందించారు.

ట్రంప్‌కు ముచ్చెమటలు..
డిబేట్‌ పొడవునా హారిస్‌ పదేపదే ట్రంప్‌కు చెమటలు పట్టించారు. పలు కేసుల్లో ఆయన దోషి అని ఇప్పటికే నిరూపణ అయిందంటూ పదేపదే ఎత్తిచూపారు. ఆయనపై మరెన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ట్రంప్‌ మాట్లాడుతుండగా పదేపదే నవ్వులు, ప్రశ్నార్థక చూపులతో ఆయన్ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ ఎత్తుగడలన్నీ బాగా ఫలించాయి. హారిస్‌ ఇలాంటి విమర్శలు చేసినప్పుడల్లా ట్రంప్‌ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆగ్రహంలో అదుపు తప్పి పదేపదే అబద్ధాలు, అవాస్తవాలు చెప్పారు. కమలా హారిస్‌ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు. ఆఫ్రో అమెరికన్ల ఓట్ల కోసం హారిస్‌ ఇటీవల ఆమె నల్లజాతి మూలాలను పదేపదే చెప్పుకుంటున్నారన్న తన గత వ్యాఖ్యలపై స్పందించేందుకు ట్రంప్‌ నిరాకరించారు. హారిస్‌ మాత్రం పలు సందర్భాల్లో ట్రంప్‌ చేసిన వివాదాస్పద జాతి వివక్షపూరిత, విద్వేష వ్యాఖ్యలన్నింటినీ ఏకరువు పెట్టారు.

పక్కా వ్యూహంతో డిబేట్‌కు..
డిబేట్‌కు కమలా పక్కాగా హోం వర్క్‌ చేసి వచ్చిన తీరు డిబేట్‌లో అడుగడుగునా కన్పించింది. తొలుత కాస్త తడబడ్డా డిబేట్‌ సాగుతున్న కొద్దీ హారిస్‌ దూకుడు కనబరిచారు. పదునైన పంచ్‌లతో, టైమ్లీ వన్‌ లైనర్లతో ఎక్కడికక్కడ ట్రంప్‌ను ఇరుకున పెట్టారు. ఆర్థిక వ్యవస్థ మొదలుకుని విదేశీ విధానం, వలసలు, అబార్షన్ల దాకా ప్రతి అంశం మీదా చర్చను తను కోరుకున్న దిశగా నడిపించడంలో విజయవంతమయ్యారు. గతంలో లాయర్‌ అయిన హారిస్‌ వాదనా పటిమ ముందు ట్రంప్‌ నిలువలేకపోయారు. చాలావరకు ఆమె ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు వివరణలు ఇచ్చుకోవడానికే పరిమితమయ్యారు.

తొలి డిబేట్‌లో తేలిపోయిన బైడెన్‌..
తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్‌ ఓ ఆటాడుకోవడం తెలిసిందే. ట్రంప్‌ పచ్చి అబద్దాలు చెప్పినా బైడెన్‌ కనీసం వాటిని వేలెత్తి చూపలేకపోయారు. పైగా ప్రసంగం మధ్యలో పదేపదే ఆగుతూ, పదాల కోసం తడుముకుంటూ, వయోభారంతో వణుకుతూ అభాసుపాలయ్యారు. ఈ దారుణ వైఫల్యంతో చివరికి పోటీ నుంచే బైడెన్‌ తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో అధ్యక్ష రేసులోకి వచ్చిన హారిస్‌ మాత్రం తాజా డిబేట్‌లో ట్రంప్‌కు చెమటలు పట్టించారు. ‘మన దేశాన్ని ఎలా నడపాలన్న ప్రధానాంశంపై ఈ రాత్రి మీరు ఇంతసేపూ రెండు భిన్నమైన వాదనలు విన్నారు. ఒకటి భవిష్యత్తుపై దృష్టి పెట్టిన నా వాదన. రెండోది గతం గురించి మాత్రమే మాట్లాడిన, దేశాన్ని వెనక్కే తీసుకెళ్లజూస్తున్న ట్రంప్‌ వాదన’ అంటూ డిబేట్‌ను అంతే ప్రభావవంతంగా ముగించారు హారిస్‌.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular