Yogi Adityanath – Adavi Sesh : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరకు అడవి శేషు.. ఏంటి కథ

దేశం గర్వించదగ్గ సినిమా తీశారని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలుగు నటుడు, దర్శకుడిని పిలిచి సన్మానించి గౌరవించారు.

Written By: NARESH, Updated On : May 12, 2023 8:28 pm
Follow us on

Yogi Adityanath – Adavi Sesh : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు ప్రముఖ టాలీవుడ్ నటుడు అడవి శేషు. వీరిద్దరి కలయిక ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అడవి శేషును యోగి ఆదిత్యనాథ్ ఘనంగా సన్మానించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అడవి శేషు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎందుకు కలిశారు..? అసలు దీని వెనుక ఉన్న కథేంటో మీరు చదివేయండి.
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. అద్భుతమైన పాలన అందిస్తూ, సింప్లిసిటీ జీవితాన్ని గడుపుతుంటారు ఆదిత్యానాథ్. దేశ రాజకీయాలను భవిష్యత్తులో శాసించే నాయకుడిగా బిజెపి సర్కిల్స్ లో యోగి ఆదిత్యనాథ్ గురించి తెగ ప్రచారం జరుగుతోంది. 2024 పార్లమెంటు ఎన్నికల తర్వాత భారతదేశానికి కాబోయే ప్రధాని ఆదిత్యనాథ్ అన్న చర్చ దేశంలో జోరుగా సాగుతోంది. అటువంటి శక్తివంతమైన నాయకుడిని కలిశారు టాలీవుడ్ నటుడు అడవి శేషు. కొన్ని నిమిషాల పాటు ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చించడం ఆసక్తిని కలిగిస్తోంది.
అడవి శేషును అభినందించిన ఆదిత్యనాథ్.. 
టాలీవుడ్ నటుడు అడవి శేషు హీరోగా కొద్ది నెలల కిందట విడుదలైన మేజర్ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదట తెలుగులో మాత్రమే విడుదల కాగా.. అభిమానుల నుంచి విశేషమైన స్పందన రావడంతో ఇతర భాషల్లోకి అనువదించి విడుదల చేశారు. సైన్యంలో వీరమరణం పొందిన ఓ సైనిక అధికారి వాస్తవ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా అద్భుత విజయం సాధించింది. గొప్ప సినిమాను దేశానికి అందించారన్న ఉద్దేశంతో చిత్ర బృందాన్ని పిలిపించుకొని మరి సన్మానం చేశారు యోగి ఆదిత్యనాథ్. నటుడు అడవి శేషుతోపాటు దర్శకుడు ఇతర చిత్ర బృంద సభ్యులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో సమావేశమయ్యారు. వీరందరినీ ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించి అభినందించారు.
తెలుగు రాష్ట్రాల నేతలకు పట్టని సినిమా..
దేశం గర్వించదగ్గ సినిమా తీశారని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలుగు నటుడు, దర్శకుడిని పిలిచి సన్మానించి గౌరవించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక దర్శకుడు తీసిన, ఒక నటుడు నటించిన సినిమా దేశ వ్యాప్తంగా ప్రజలందరి మన్ననలు పొందుతున్నప్పటికీ.. ఇక్కడి నేతలు గుర్తించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలకు, నాయకులకు తాము నమ్ముతున్న నాయకులను మాత్రమే దేవుడిగా భావిస్తారు తప్ప దేశం గురించి, సైన్యం గురించి, దేశం బలం, బలహీనతల గురించి అవసరం లేకుండా పోయిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం దేశం పట్ల ప్రేమ, అభిమానం ఉండాలని పలువురు సూచిస్తున్నారు. అదే ఉంటే గొప్ప చిత్రాన్ని అందించిన ఈ చిత్ర బృందాన్ని మర్చిపోయే వారు కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు, నాయకులు చేసిన తప్పుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేయలేదు. గొప్ప చిత్రాన్ని తీసిన దర్షకుడితోపాటు నటించిన చిత్ర బృందాన్ని సత్కరించారు ఆదిత్యానాథ్. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ చిత్ర బృందాన్ని పిలిపించి చిరు సత్కారం చేస్తే వాళ్లు గర్వంగా ఫీల్ అయ్యే వారని, అటువంటి పనిని తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు ప్రతిపక్షాలు చేయకపోవడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు. మన దగ్గర ఉన్న ప్రతిభను, గొప్ప వ్యక్తులను గుర్తించకపోవడం కుసంస్కారమన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి యోగి ఆదిత్యనాథ్ కలిసిన తర్వాత అయినా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగాని, ప్రతిపక్షాల నుంచి గాని ఈ బృందానికి పిలుపు వచ్చి గౌరవం లభిస్తుందేమో..