Raghavendra Rao: రాఘవేంద్రరావు అనే కుర్రాడు ‘జ్యోతి’ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న రోజులు అవి. అప్పటికే హీరోగా మురళీమోహన్ అనే చిన్న హీరోని ఖాయం చేసుకున్నారు. కానీ హీరోయినే ఖరారు కావడం లేదు. మద్రాసు నుంచి కేరళ వరకూ ఎందరో అమ్మాయిలు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ రాఘవేంద్రరావుకి మాత్రం ఎవ్వరూ నచ్చడం లేదు. మరో పక్క సినిమా షూటింగ్ కి లేట్ అవుతుంది. దీనికితోడు నిర్మాతల్లో అసంతృప్తి ఎక్కువవుతుంది. సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని మురళీమోహన్ లో భయం పట్టుకుంది.

ఓ రోజు ఉదయం చిన్నగా రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లి పక్కన కూర్చున్నాడు. తాను అప్పటికే చేస్తోన్న ‘లక్ష్మణ రేఖ’ అనే సినిమా గురించి, ఆ సినిమాలో హీరోయిన్ గురించి రాఘవేంద్రరావుకి గొప్పగా చెప్పడం మొదలు పెట్టాడు. కాసేపు ఆలోచించి ‘ఎవరు ఆ హీరోయిన్ ?’ అంటూ రాఘవేంద్రరావు అడిగారు. ‘పేరు జయసుధ, మొదటిసారి హీరోయిన్ గా చేస్తోందండీ’. ‘అమ్మాయి బాగుంటుందా ? బాగా నటిస్తోందా ?’ అంటూ మురళీమోహన్ మొహంలోకి చూశారు రాఘవేంద్రరావు.
‘అద్భుతమైన ఫేసు అండీ. నటన విషయంలో మంచి నటి, చాలా బాగా నటిస్తోంది అండీ’ అని సైలెంట్ అయిపోయాడు మురళీమోహన్. ఎక్కువ చెప్పినా సమస్యే అని. ‘సరే, ఇంతగా చెబుతున్నావ్ కాబట్టి, ఒకసారి ఆ అమ్మాయి ఆల్బమ్ తెప్పించు, చూద్దాం’ అన్నాడు రాఘవేంద్రరావు. అదే రోజు సాయంత్రం మురళీమోహన్ తెప్పించిన ఆల్బమ్ ను రాఘవేంద్రరావు పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు.
అది చూస్తూ మురళీమోహన్ లో టెన్షన్ పెరిగిపోతూ ఉంది. అనవసరంగా ఎక్కువ మాటలు చెప్పి.. స్వయంగా ఆల్బమ్ తెచ్చి ఇచ్చాడు. వ్యవహారం అటు ఇటు అయితే తన పోస్టుకే ప్రమాదం. ఆల్బమ్ మూసేసి రాఘవేంద్రరావు మురళీమోహన్ వైపు సీరియస్ గా చూస్తూ.. ‘ఈ అమ్మాయి బాగుందయ్యా. ఎక్స్ ప్రెసివ్ కళ్ళు, ఫేస్ కూడా బాగుంది. మనకు చక్కగా సరిపోతుంది’ అని ముగించారు రాఘవేంద్రరావు.
ఆ తర్వాత రోజే జయసుధను అఫీస్ కి పిలిచారు. ఆమెతో రాఘవేంద్రరారే గంట సేపు మాట్లాడి.. ‘అమ్మాయి బ్రహ్మాండంగా నటిస్తోంది, ఈమె మన హీరోయిన్’ అని చివరకు జయసుధను ‘జ్యోతి’ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఆ సినిమా జయసుధ కెరీర్ కి పెద్ద ప్లస్ అయింది. అంతకుముందు చిన్న చిన్న పాత్రలే చేసే జయసుధ ఒక్కసారిగా స్టార్ అయింది. అలాగే రాఘవేంద్రరావుకి కూడా దర్శకేంద్రుడిగా ఎదగడానికి ‘జ్యోతి’ సినిమానే పునాది అయింది.