Kota Srinivasa Rao: కోట శ్రీనివాస రావు సినిమాల్లోకి కొత్తగా వచ్చిన రోజులు అవి. అప్పుడప్పుడే నటుడిగా ఎదుగుతున్నాడు. సహజంగా డేట్లు, ప్రొడక్షన్ వ్యవహారాలు, మేనేజర్లు ఇలా చాలా ఉంటాయని కోట శ్రీనివాసరావుకి తెలియదు. ఒకపక్క నటుడిగా పేరు తెచ్చుకుంటున్నా.. మిగిలిన విషయాలు ఆయనకు వంటబట్టలేదు. కాల్షీట్లు గురించి అయితే అసలేమీ తెలిసేది కాదు. ఎక్కడ షూటింగ్ ఉందంటే అక్కడికి వెళ్లేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టే.. ఏ సినిమాకు ఎంత పారితోషికం తీసుకోవాలో కూడా అర్ధమయ్యేది కాదు.

అయితే, ఓ రోజు హీరో కృష్ణంరాజుగారి గోపీకృష్ణా ఆఫీసుకు వెళ్లారు కోట. అప్పటికే ‘తాండ్ర పాపారాయుడు’ చిత్రానికి 12 రోజులు పాటు పనిచేశారు. కృష్ణంరాజుగారు బ్రదర్ సూర్యనారాయణరాజు, కోట శ్రీనివాసరావును చూడగానే.. ఆఫీసు బోయ్ చేత మర్యాదలు చేయించి కూర్చోపెట్టారు. ఆ రోజుల్లో అతిథులను సత్కరించడంలో కృష్ణంరాజు బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ పెట్టింది పేరు.
సూర్యనారాయణరాజు లెక్కలు చూస్తూ..‘చెప్పండి, శ్రీనివాసరావు గారు. 12 రోజులు పని చేశారు. ఎంత ఇవ్వమంటారు ?’ అని అడిగారు. ఆ మాటకు ఏం చెప్పాలో అర్థం కాక అటూ ఇటూ చూస్తూ మొహమాట పడుతూ కూర్చున్నాడు కోట. అంతలో అక్కడికి వచ్చిన కృష్ణంరాజు గారు కోట శ్రీనివాసరావుని చూసి..’హా.. శ్రీనివాసరావు.. ఏమిటి ఇలా వచ్చావ్ ? అందరూ బాగా చేస్తున్నావని చెబుతున్నారు’ అంటూ చెప్పుకుంటూ పోతున్నారు.
కోట ఆలోచనలు మాత్రం ‘రెమ్యునరేషన్ ఎంత తీసుకోవాలి ?’ అన్న దగ్గరే ఆగిపోయాయి. అది గమనించిన కృష్ణంరాజు ‘మొహంలో ఆలోచనలు.. దేని గురించి’? పక్కన సూర్యనారాయణరాజు చెబుతూ ‘మన తాండ్ర పాపారాయుడు సినిమాకి ఇంతవరకూ ఏమి ఇవ్వలేదు. ఎంత ఇవ్వాలి అని అడుగుతుంటే.. అదుగో అలా నసుగుతున్నాడు’.
ఆ మాటకి కృష్ణంరాజు నవ్వి.. ‘ఏమిటయ్యా కోట, సినిమా ఇండస్ట్రీలో డబ్బులు అడిగితేనే ఇవ్వరు, అలాంటిది ఇలా నసుగుతూ ఉంటే ఇక నలిపేస్తారు.. జాగ్రత్త. డబ్బులు అడిగి తీసుకోవాలయ్యా’. ఆ మాటలకూ కోట ఇబ్బందిగా ‘అది గాదు సర్, నేను కొత్త కదా, ఏ వేషానికి ఎంత తీసుకోవాలో అర్థం కావట్లేదు సర్’ అని మళ్ళీ మౌనంగా కూర్చున్నాడు.
కృష్ణంరాజు, కోట వైపు తీక్షణంగా చూసి.. కొన్ని క్షణాలు ఆలోచించి.. ‘ఒక పని చేయవయ్యా, 15 రోజులకు ఒక రూ. 20 వేలు తీసుకో. పేరు వచ్చేవాడివి కాబట్టి.. కొన్నాళ్ళు పోయాక రేటు పెంచుకుంటూ పో’ అని అన్నారు. అలా కోట శ్రీనివాస రావు తన రెమ్యునరేషన్ ను ఫిక్స్ చేసుకుని.. కొన్నాళ్ళకు పెంచుకుంటూ పోయారు.