Giribabu: అవి ‘జగమే మాయ’ షూటింగ్ జరుగుతున్న రోజులు. రాత్రిలు షూట్ చేస్తున్నారు. చలి కాలం.. దాంతో విపరీతమైన చలి, సీన్ ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటలకు షూట్ చేయాలి. సీన్ లో గిరిబాబునే మెయిన్. ఆయన చకచకా మేకప్ వేసుకుని, రాత్రి 10 గంటలకే సెట్ లో సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. అలాగే ఉన్నారు. కానీ ఆ సీన్ మాత్రం పూర్తి చేయలేకపోతున్నారు. షూటింగ్ నెమ్మదించింది అంటూ పక్కన ఉన్న నిర్మాత పూర్ణచంద్రరావుగారు సీరియస్ అవుతున్నారు. ఆయన కోపంగా గిరిబాబు దగ్గరకు వచ్చారు.

గిరిబాబుకు అది మొదటి సినిమా. ‘ఏమిటయ్యా ? ఏమి చేస్తున్నావ్ ? ఆలస్యం జరుగుతోంది ? అంటూ పూర్ణచంద్ర రావు గారు నిలదీసే సరికి గిరిబాబులో టెన్షన్ మొదలైపోయింది. చుట్టూ ఉన్నవారు కూడా గిరిబాబును చూసి నవ్వుకుంటున్నారు. ఇక చేసేది ఏమి లేక పూర్ణచంద్ర రావు దగ్గరకి వెళ్లి వణుకుతూ.. ‘భయంగా ఉందండి.. డైలాగ్ లు పెద్దగా ఉన్నాయి, పైగా బాగా చలి.. షివరైపోతున్నానండీ’ అంటూ నసుగుతూ చెప్పుకుకొచ్చాడు.
గిరిబాబును కిందకి పైకి ‘ఓహో షివరైపోతున్నావా.. ?’ అని కాసేపు ఆలోచించి పక్కన ఉన్న బాయ్ ని పిలిచి ఏదో చెప్పి పంపించారు. గిరిబాబులో భయం ఎక్కువైంది. ఆ కుర్రాడికి ఏమి చెప్పాడో అని. పది నిమిషాలు తర్వాత ఆ కుర్రాడు వచ్చి ఒక గ్లాస్ లో జ్యూస్ తెచ్చిచ్చాడు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న గిరిబాబు చూసుకోకుండానే ఆ గ్లాస్ లో జ్యూస్ ని ఒక సిప్పు వేశాడు.
ఎందుకో ఆ జ్యూస్ నాలుకకి చేదుగా అనిపించింది. ‘ఏమిటి ఇది ? జ్యూస్ చేదుగా ఉంది ’ అని చూస్తే.. అదేదో డ్రింక్ లా ఉంది. మరోపక్క పూర్ణచంద్ర రావు గారు ‘ఏమిటయ్యా షివరైపోతున్నావుగా తాగు’ అని అరిచారు. ఆ చలిలో వేడిగా గమ్మత్తుగా ఉన్న జ్యూస్ ను ఆస్వాదిస్తూ తాగేశాడు గిరిబాబు. అంతే.. తెలియని ఉత్సాహం వచ్చింది. గొంతులో జ్యూస్ పడగానే ఒక రకమైన హుషారుతో పైకి లేచాడు.
చలి పుడుతున్నా చలాకీగా డైలాగులు చెప్పేస్తూ పోతున్నాడు. వెంటనే అందరూ ఏమి జరిగింది అన్నట్టూ నిర్మాత వైపు చూశారు. కానీ గిరిబాబు గారు మాత్రం గ్యాప్ లేకుండా డైలాగ్ లు చెబుతూ పోతున్నారు. పూర్తి కాని షూటింగ్ రెండు గంటల్లోనే పూర్తైపోయింది. పూర్ణచంద్ర రావు గారి దగ్గరకు వచ్చి ఆ జ్యూస్ లో ఏం వేశారు సార్’ అని అడిగారు గిరిబాబు.
ఆ మాటలు అమాయకంగా అనిపించాయేమో పూర్ణచంద్ర రావు గారు నవ్వసాగారు. నవ్వుతూనే ‘అది జ్యూస్ కాదయ్యా.. బ్రాందీ’ అన్నారు. ‘బ్రాందీయా?’ అంటూ గిరిబాబు బిక్కమొహం పెట్టారు. అప్పటికీ గిరిబాబుకి మద్యం సేవించడం అలవాటు లేదు అట.