‘మెగాస్టార్ చిరంజీవి’.. తెలుగు చిత్ర పరిశ్రమను నాలుగు దశాబ్దాలుగా ఏలుతున్న మకుటం లేని రారాజు. తన అభినయంతో, డ్యాన్స్ లతో ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసిన చిరంజీవి 1955వ సంవత్సరంలో ఆగష్టు 22వ తేదీన వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు మొగల్తూరులో జన్మించాడు. అందరి లాగే సినిమాల్లో అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు.
వేషాల కోసం తిరుగుతున్న చిరంజీవికి ‘పునాదిరాళ్ళు’ రూపంలో అవకాశం వచ్చింది. అప్పటి వరకూ అందరూ కొణిదెల శివశంకర వర ప్రసాద్ అని పిలిచే వారు. కానీ మొదటి సినిమా చేస్తోన్న సమయంలో ఆంజనేయస్వామి గుడి మెట్ల పై కూర్చుని ఉన్నారు చిరు. అప్పుడే తనను ఎవరో వ్యక్తి ‘చిరంజీవి’ అని మొదటిసారి పిలిచారు. లేచి చూస్తే అది కల.
అలా వచ్చిన ఆ కల, ఆయనను చాల రోజులు వెంటాడింది. ఒక రోజు తనకు వచ్చిన ఆ కల గురించి వాళ్ళ అమ్మగారికి చెప్పారు చిరు. ‘చిరంజీవి’ అనేది ఆంజనేయస్వామికి మారు పేరు, నువ్వు సినిమా తెర పై ఆ పేరే పెట్టుకోరా అంటూ ఆమె సలహా ఇచ్చారు. అప్పటికే ‘పునాది రాళ్లు’ సినిమా షూటింగ్ పూర్తి అయింది.
నిర్మాతలు పునాది రాళ్ళు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లోనే మొదటిసారి చిరు తన పేరుని చిరంజీవి అని అధికారికంగా ప్రకటించారు. అలా చిరంజీవిగా తెలుగు చలనచిత్ర రంగానికి మెగాస్టార్ గా ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాధించుకున్నారు. పైగా ‘పునాది రాళ్ళు’ సినిమాతో చిరంజీవి సినీ ప్రస్థానానికి గొప్ప పునాది పడింది.
అయితే, ‘పునాదిరాళ్ళు’ సినిమా కంటే ముందే.. ‘ప్రాణం ఖరీదు’ సినిమా విడుదలై.. చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, ‘మన వూరి పాండవులు’ అనే సినిమా చిరుకి ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత నటుడిగా ఒక్కో సినిమాకి ఒక్కో మెట్టు ఎక్కినా.. చిరంజీవిని స్టార్ ను చేసింది మాత్రం ‘ఖైదీ’ సినిమానే. ప్రభంజనాన్ని సృష్టించిన ఖైదీ కారణంగానే చిరంజీవి కాస్త మెగాస్టార్ అయ్యారు. ఇప్పటికీ మెగాస్టార్ గానే కొనసాగుతున్నారు.