ముప్పై పాతికేళ్ల క్రితం తెలుగు సినిమాల్లో పాత్రలకు రక్తమాంసాలు కాస్త ఎక్కువుగా ఉండేవి. ఆ పాత్రను తెర మీద చూస్తుంటే.. నిజ జీవితంలో మనకు తారసపడిన మనుషులే గుర్తుకొస్తారు. ఇక ప్రత్యేకించి దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ సినిమాల్లోని పాత్రలు చాల ఆసక్తికరంగా ఉండేవి. ఆయన కూడా చాలా ముచ్చటపడి ప్రతి పాత్రను కథకు అనుగుణంగా డిజైన్ చేసుకునేవారు.
అవి ‘శత్రువు’ సినిమా చేస్తోన్న రోజులు. ఎప్పటిలాగే కోడి రామకృష్ణ, ఆ సినిమాలో కూడా ఒక పాత్రను బాగా రాసుకున్నారు. అన్నిటికి మించి ఆ పాత్రలో డిఫరెంట్ మేనరిజమ్స్ ను పెట్టారు. పైగా ఏమాటకామాట చెప్పుకోవాలి, ఆ పాత్ర తీరును సెట్ లో నటుడికి ఆయనే నటించి చూపించే వారు. అయినా ఏ నటుడు సరిగ్గా నటించలేక ఇబ్బంది పడుతున్నారు. అప్పటికే ఆ పాత్రలో ఇద్దరు నటులు మారిపోయారు.
కోడి రామకృష్ణగారు యాక్ట్ చేసి చూపిస్తుంటే భలే నవ్వొచ్చేస్తోంది. దాంతో ‘డైరెక్టర్ గారి లాగా నేను చేయగలనా?’ అని ప్రతి నటుడు లోలోపలే మథనపడిపోయి చివరకు ఆ భయంతోనే సరిగ్గా నటించలేక, ఆ సినిమా నుండి తప్పుకుంటూ ఉన్నారు. ఇక ఈ పాత్ర చేయాలంటే.. ఒక్కడే ఉన్నాడు, కోడిరామకృష్ణగారు ఆసక్తిగా ‘ఎవరు ?’ అని ఆలోచనలో పడ్డారు. పేరు కోట. నిజమే, నేను చాలా ముచ్చటపడి రాసుకున్న ఈ పాత్రకి అతనే కరెక్ట్, వెంటనే పిలిపించండి.
కట్ చేస్తే.. కెమెరా స్టార్ట్ అని కోడి రామకృష్ణగారు ఎదురుగా ఉన్న నటుడి వైపు అలాగే టెన్షన్ గా చూస్తున్నారు. ‘రోలింగ్ సార్’ అని అసిస్టెంట్ వాయిస్ రాగానే, యాక్షన్ అని అరిచారు కోడి. ఆవేశంతో ఊగిపోతూ డైలాగ్ చెప్పి ఎదురుగా నిలబడ్డారు కోట. ‘వన్‌మోర్’ అనే సౌండ్ కోటకు వినిపించింది. కట్, నాలుగు గంటలు గడిచిపోయాయి. 17 సార్లు వన్ మోర్ లు అయిపోయాయి. కోట శ్రీనివాసరావు అనే నటుడు ఇన్ని టేకులు తినడం ఇదే మొదటిసారి.
కెమెరామన్ ఎస్.గోపాలరెడ్డి ఇదంతా గమనించి.. ‘కోటయ్యా… ఇలా రా’ అని పక్కకి తీసుకువెళ్లి ‘ఈ క్యారెక్టర్ నువ్వు చెయ్యాలి. నువ్వే చేయగలవు’ అని దైర్యం నూరిపోశారు. ఇంతలో కోడి రామకృష్ణగారు ‘బ్రేక్’ చెప్పారు. కోట వెళ్లి కాస్త తీర్థం పుచ్చుకుని వచ్చి సెట్ లో నిలబడ్డారు. పక్కనున్న నటీమణులు ‘ఇక్కడ మందు వాసన ? అని కోట వైపు అనుమానంగా చూస్తున్నారు, అంతలో యాక్షన్ మొదలైంది, సెట్ అంతా చప్పట్లతో మారుమ్రోగుతుంది. కోట యాక్షన్ దెబ్బకు అక్కడున్న వారందరికీ ఫుల్ గా కిక్ ఎక్కింది. షాట్ విజయవంతంగా ముగిసింది.