Rashmika Mandana: నేషనల్ క్రష్ అనే హోదా. సినిమాకు నాలుగైదు కోట్ల సంపాదన. చేతినిండా సినిమాలు. ఖరీదైన కార్లు, బంగ్లాలు. రష్మిక మందాన లేటెస్ట్ ప్రొఫైల్ ఇది. అలాంటి రష్మిక మందాన కనీసం ఇంటి రెంట్ కట్టలేదంటే నమ్ముతారా? ఒక చిన్న బొమ్మ కొనుక్కోవడానికి డబ్బులు లేవంటే వింటారా?. కానీ ఇవ్వన్నీ నిజమే అంటుంది రష్మిక మందాన. తన చిన్నతనంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. రష్మిక చిన్నతనంలో పేరెంట్స్ కనీసం ఇంటి అద్దె కట్టలేకపోయేవారట. ప్రతి రెండు నెలలకు ఇల్లు మారేవారట.

ఇంటి అద్దె చెల్లించలేదని యజమానులు ఇల్లు ఖాళీ చేయించి బయటకు పంపేవారట. దీంతో అద్దె ఇల్లు వెతుక్కోవడం నిత్యకృత్యం అయ్యేదట. పేరెంట్స్ కి తాను కోరుకుంది ఇవ్వాలని ఉండేదట. అయితే అది కొనివ్వడానికి డబ్బులు ఉండేవి కావట. కనీసం ఒక బొమ్మ కొనిపెట్టే స్థోమత కూడా రష్మిక పేరెంట్స్ కి ఉండేది కాదట. అందుకే ప్రతి రూపాయిని నేను గౌరవిస్తాను. ఈ సక్సెస్, ఫేమ్ గ్రాంటెడ్ తీసుకోను. మా కుటుంబం అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. చిన్నప్పుడు కేవలం నీడ కోసం మేము పడ్డ ఇబ్బందులు నాకు తెలుసని, రష్మిక అలనాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
ఇప్పుడు ఆమె రేంజ్ వేరు. రష్మిక ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులకు కూడా జరిగాయి. ముంబైలో ఖరీదైన ఓ అపార్ట్మెంట్ కొన్నట్లు సమాచారం.ఆమె ప్రస్తుత ఆస్తి విలువ కోట్లలో ఉంది. అంతటి పేదరికం నుండి రష్మిక ఈ స్థాయికి రావడం జరిగింది. కన్నడ అమ్మాయి అయిన రష్మిక కిరాక్ పార్టీ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తెలుగులో ఆమెకు ఛలో బ్రేక్ ఇచ్చింది. గీత గోవిందంతో రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యారు. మహేష్ కి జంటగా సరిలేరు నీకెవ్వరు చేయగా అది కూడా విజయం సాధించింది.

పుష్ప మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టింది. ప్రస్తుతం రష్మిక హీరోయిన్ గా పుష్ప 2, వారసుడు, యానిమల్ వంటి భారీ ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. తెలుగు నుండి హిందీ వరకు జోరు చూపిస్తుంది. ఇటీవల సోషల్ మీడియా ట్రోల్స్ పై రష్మిక మండిపడ్డారు. నెగిటివ్ కామెంట్స్ కుటుంబ సభ్యులతో పాటు తనను మానసిక వేదనకు గురి చేస్తున్నాయి, ఇకపై సహించేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాగా చాలా కాలంగా రష్మిక-విజయ్ దేవరకొండ మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.