Two Pan India Movies: కరోనా మహమ్మరి గడిచిన రెండేళ్లుగా ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి కొత్త వేరియంట్ లో రూపంలో కరోనా విరుచుకుపడుతోంది. నిన్నటి వరకు డెల్టా వేరియంట్ తో ప్రజలను భయాందోళనకు గురిచేసిన కరోనా ఇప్పుడు ఒమ్రికాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. భారత్ లోనూ ఇటీవల ఒమ్రికాన్ కేసులో భారీగా నమోదవుతుండటంతో కేంద్రం ముందస్తు చర్యలను తీసుకుంటోంది.
గత కొద్దిరోజులుగా మహారాష్ట్రలో ఒమ్రికాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, గుజరాత్, కేరళ, తెలుగు రాష్ట్రాలున్నాయి. ఈక్రమంలోనే దేశవ్యాప్తంగా ఒమ్రికాన్ కట్టడిలో భాగంగా పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై భారీగా పడుతోంది. గతంలో కరోనాతో థియేటర్లు మూతపడటంతో ఇండస్ట్రీపై ఆధారపడిన వారంతా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిన సంగతి అందరికీ తెల్సిందే.
ప్రస్తుతం ఒమ్రికాన్ ఆంక్షల నేపథ్యంలో మరోసారి అలాంటి పరిస్థితులే ఇండస్ట్రీకి ఎదురయ్యేలా కన్పిస్తున్నారు. ఈ సంక్రాంతికి రెండు పాన్ ఇండియా సినిమాలైన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ రిలీజుకు రెడీ అవుతున్నాయి. భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమాలు ఒమ్రికాన్ పరిస్థితుల నేపథ్యంలో విడుదలైతే భారీగా నష్టపోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మహారాష్ట్రలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో రాత్రి షోలకు రెడ్ సిగ్నల్ పడింది. మరోవైపు 50శాతం ఆక్సుపెన్సీకి మాత్రమే ప్రభుత్వం అనుమతిని ఇస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. తెలంగాణలోనూ న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమ్రికాన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఆంక్షలు అమలుకే మొగ్గుచూపుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు, ప్లబ్బులు, హోటళ్లు, జిమ్ వంటి ప్రాంతాల్లో 50శాతం ఆక్సుపెన్సీ అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇలాయితే ఓవర్సీస్ లోనూ ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ మూవీలపై ప్రభావం పడే అవకాశం కన్పిస్తోంది.
కరోనా రెండు డోసులు వేసుకున్న వారికి సైతం ఒమ్రికాన్ సోకుతుండటంతో అన్ని రాష్ట్రాల అప్రమత్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో కొత్త సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు ఒమ్రికాన్ కట్టడికి మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం కన్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో భారీ బడ్జెట్లో నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ తమ రిలీజు డేట్ ను మార్చుకుంటాయా? లేదంటే ముందుకెళుతాయా? అనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది.