Tv Serials : ప్రేక్షకులు సినిమాల కంటే ఎక్కువగా సీరియల్స్ కి బాగా అలవాటు పడ్డారు. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన స్త్రీలకు ఎంటర్టైన్మెంట్ ఆంటే సీరియల్స్ మాత్రమే. అప్పట్లో సీరియల్స్ మంచి కథ, కథనం, స్క్రీన్ ప్లే తో నడిచేవి. ఎన్ని సంవత్సరాలు టెలికాస్ట్ చేసిన జనాలు చూసేవారు. ఎందుకంటే అంతటి కంటెంట్ ఆ సీరియల్స్ లో ఉండేవి. ఉదాహరణకు ‘మొగలిరేకులు’, ‘చక్రవాకం’ వంటివి తీసుకోవచ్చు. ఈ సీరియల్స్ కి రిపీట్ టెలికాస్ట్ లో కూడా బంపర్ టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి. అలాగే యూట్యూబ్ లో కూడా ఈ సీరియల్స్ కి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేవి. వీటితో పాటు మన చిన్నతనం లో ‘అన్వేషణ’, ‘అందం’, ‘నాన్న’, ‘ఎండమావులు’ ఇలా ఎన్నో అద్భుతమైన కథ బలం ఉన్న సీరియల్స్ మనల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మధ్యలో ‘అమృతం’ లాంటి ఎవర్ గ్రీన్ కామెడీ సీరియల్స్ కూడా వచ్చేవి. మన బాల్యం ‘అమృతం’ సీరియల్ తో ముడిపడకుండా ఉండదు. అలాంటి సీరియల్స్ చూసిన కళ్ళతో ప్రస్తుతం ప్రసారం అవుతున్న సీరియల్స్ ని చూస్తే కళ్ళు తిరగక తప్పదు. జెమినీ టీవీ లో ఒకప్పుడు సెన్సేషనల్ హిట్స్ గా నిల్చిన సీరియల్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రసారం అవుతున్న సీరియల్స్ ని చూస్తే మనకి పిచ్చి ఎక్కిపోవడం ఖాయం, అంత దారుణంగా ఉన్నాయి.
రెండు నెలల క్రితం చూసినప్పుడు కథ ఎక్కడ ఉందో, రెండు నెలల తర్వాత కూడా కథ అక్కడే ఉంటుంది. ఈటీవీ లో ప్రసారమయ్యే కొన్ని సీరియల్స్ లో అయితే గర్భం దాల్చిన హీరోయిన్ రెండు మూడేళ్లు గడిచినా కూడా ప్రసవించదు. అంతటి దారుణమైన సీరియల్స్ ఉన్నాయి. ఇక జీ తెలుగు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండు మూడేళ్ళ క్రితం ఏ సీరియల్స్ అయితే ఈ ఛానల్ లో టెలికాస్ట్ అయ్యేవో, ఇప్పటికీ అవే టీవీ సీరియల్స్ కొనసాగుతున్నాయి.కథ లేదు, కాకరకాయ లేదు, ఒకే పాయింట్ మీద స్టోరీ సాగదీసి జనాలను చావగొడుతున్నారు. దీంతో ఈ ఛానల్ టీఆర్ఫీ రేటింగ్స్ పాతాళంలోకి పడిపోయింది. ఒక లైన్ దగ్గర కథ మొదలై సంబంధం లేకుండా ఎక్కడికో వెళ్లిపోతున్నాయి జీ తెలుగు సీరియల్స్. ‘త్రిణయిని’ అనే సీరియల్ ని ఎప్పుడో మన చిన్నప్పుడు చూసుంటాము. ఇప్పటికీ అది జీ తెలుగు లో నడుస్తూనే ఉంది. ప్రారంభం లో కథ కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది, ముందుకు వెళ్లే కొద్దీ కథ ఎక్కడైతో మొదలైందో అక్కడే ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో ఎంతో మంది ఇండస్ట్రీ కి వస్తున్నారు, కానీ ఈ సీరియల్ డైరెక్టర్స్ ఎందుకు ఇంకా పదేళ్లు వెనక్కి వెళ్లారో అర్థం కావడం లేదు. ఈమధ్య కాలం లో ప్రతీ సీరియల్ ఒకేలాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సీరియల్స్ లో ఉండే లేడీ విలన్స్ అత్యంత క్రూరంగా ఉంటారు.
మన నిజజీవితం లో ఇలాంటోళ్లను ఎక్కడా చూసి ఉండము. సహజత్వానికి ఏమాత్రం దగ్గరగా లేకపోతే జనాలు ఎలా ఆదరిస్తారు అనే ఇంకిత జ్ఞానం డైరెక్టర్స్ కి ఎందుకు ఉండదో అర్థం కాదు. ప్రస్తుతం ఉన్న టాప్ రేటెడ్ టీవీ చానెల్స్ లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ కాస్త అర్తవంతంగా ఉంటున్నాయి. వినూతనమైన సబ్జక్ట్స్ తో కుటుంబం మొత్తం కూర్చొని చూసేలాగా స్టార్ మా సీరియల్స్ ఉన్నాయి. సాగదీత కూడా ఉండడం లేదు. మహా అయితే సంవత్సరం రోజులకు మించి ఏ సీరియల్ కూడా ఉండడం లేదు. సాగదియ్యకుండా కథని ముగించేసి సరికొత్త కథతో సీరియల్స్ తీస్తున్నారు. మిగతా చానెల్స్ కూడా సీరియల్స్ విషయం లో సక్సెస్ అవ్వాలంటే కథలో ఇలా కొత్తదనం ప్రయత్నం చెయ్యాలి. ఎంతసేపు ఒకే స్టోరీ లైన్ ని సాగదీస్తూ సంవత్సరాలు తరబడి జనాల బుర్రలతో ఆడుకుంటూ డబ్బులు చేసుకోవాలనే ఆలోచన కాకుండా, సరికొత్త కథలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఆలోచనలు డైరెక్టర్స్ భవిష్యత్తులో అయినా చేస్తారో లేదో చూడాలి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More