
Trivikram- Brahmanandam: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో మంది కమెడియన్స్ ఉండొచ్చు, కానీ సినిమా బ్రతికి ఉన్నంత కాలం చిరస్థాయిగా గుర్తించుకునే పేరు బ్రహ్మానందం మాత్రమే. ఆయన ముఖం చూస్తే జీవితం లో మనం ఎదురుకుంటున్న ఎన్నో సమస్యలను కాసేపు మర్చిపోవచ్చు. మనస్ఫూర్తిగా నవ్వుకొని ఉపశమనం పొందొచ్చు. సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో కమెడియన్ గా నటించి గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన బ్రహ్మానందం కి ఒక స్టార్ హీరో కి ఉన్నంత ఇమేజి ఉంది.
ఆయన వెండితెర మీద కనిపిస్తే ఈలలు గోలలు చేసే అభిమానులు ఉన్నారు. ఒక కమెడియన్ కి ఇంత మాస్ ఫాలోయింగ్ ని చూడడం ఎప్పుడూ జరగలేదు. ఇది ఇలా ఉండగా ఇన్ని రోజులు కేవలం కమెడియన్ పాత్రలే చేస్తూ వచ్చిన బ్రహ్మానందం మొట్టమొదటిసారిగా ఒక సీరియస్ రోల్ తో ‘రంగమార్తాండ’ సినిమా ద్వారా మన ముందుకు వచ్చాడు. ఇందులో బ్రహ్మానందం చేసిన నటనకి ఎలాంటి వాడైనా కంటతడి పెట్టకుండా ఉండలేరు, అంత అద్భుతంగా ఆయన నటించాడు.

ఇది ఇలా ఉండగా నిన్న ఆయనకీ ఫిలిం ఇండస్ట్రీ తరుపున, తెలుగు సినీ కళామ్మ తల్లికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఒక చిన్న సన్మానం ని చేసారు. ఈ సన్మాన వేడుకకు చాలా మంది ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు, ఆయన బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ ‘ప్రతీ ప్రేక్షకుడు బ్రహ్మానందం ని వెండితెర మీద చూసి మురిసిపోతుంటారు, కానీ మాలాంటి దర్శకులకు దొరికే అదృష్టం ఏమిటంటే ఆయనతో కలిసి కొన్ని రోజులు ప్రయాణం చెయ్యడం, ఆయన తో కలిసి తినడం , సరదాగా కబుర్లు చెప్పుకోవడం.ఒక రోజు నేను బ్రహ్మానందం గారి ఇంటికి వెళ్లాను.ఆయన క్రింద కూర్చొని భోజనం చేస్తున్నాడు, అది చూసి ఆశ్చర్యపోయిన నేను ఇంత సింప్లిసిటీ తో ఎలా బ్రతుకుతున్నారు సార్ అనే వాడిని,అప్పుడు ఆయన సింప్లిసిటీయా నా బొంద, అన్నం తిన్న వెంటనే ప్లేట్ ని పక్కకి నెట్టేయొచ్చు అని సరదాగా సమాధానం చెప్పాడు. వెండితెర మీద మాత్రమే కాదు, నిజ జీవితం లో కూడా ఆయన అంత సరదా మనిషి’ అంటూ చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘బ్రహ్మానందం గారు సెట్స్ లో ఉన్నప్పుడు కూడా చాలా సరదాగా ఉంటాడు. ఏదైనా సన్నివేశం చెప్తున్నప్పుడు ఆయన చాలా పెద్దగా పట్టించుకోనట్టే ఉంటాడు,అసలు ఈయన మనం చెప్పేది వింటున్నాడా, పట్టించుకోవడం లేదు ఏమిటి అని ఒక్కోసారి కోపం వచ్చేది, కానీ ఆయన తన పాత్ర ని అంత తేలికగా అర్థం చేసుకొని,దాని మీద జోక్స్ వేసేవాడు.అంటే ఆయన తన పాత్రని ఎంతలా స్టడీ చేసాడో అర్థం చేసుకోవచ్చు’ అంటూ త్రివిక్రమ్ ఈ సందర్భంగా మాట్లాడాడు.