Tripti Dimri: ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమా యానిమల్. తెలుగు డైరెక్టర్ బాలీవుడ్‌లో తెరకెక్కించిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో రణబీర్ కపూర్, రష్మిక మందనకు ఎంత పేరు వచ్చిందితో ఆ సినిమాలో నటించిన మరో నటి త్రిప్తి డిమ్రికి కూడా అంతే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఈమెదే. ఈ సినిమాలో తన నటనతో యువ హృదయాలను కొల్లగొట్టింది. జోయ పాత్రలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఐఎండీబీ జాబితాలో..
ఇండియన్ మూవీ డేటాబేస్(ఐఎండీబీ) ఇటీవల విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో త్రుప్తి డిమ్రి మొదటి స్థానంలో నిలిచింది. అంతలా యానిమల్ సినిమాతో ఆమె కిక్ ఇచ్చింది. ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే కొన్నింటికి ఈ బ్యూటీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
బిజినెస్ మెన్‌తో లవ్..
ఇక త్రిప్తి డిమ్రి ఫిబ్రవరి 23న 30వ వసంతంలోకి అడుగు పెట్టింది. తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా యానిమల్ బ్యూటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆమెప్రియుడు సామ్ మర్చంట్ కూడా ఆమెకు బర్త్‌డే విషెష్ తెలిపాడు. ఈ సందర్భంగా త్రిప్తితో తీసుకున్న సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి విషెస్ చెప్పాడు. ‘నా ప్రియమైన త్రిప్తికి శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతో త్రిప్తి లవ్ స్టోరీ మరోసారి తెరపైకి వచ్చింది.
ఎవరీ సామ్ మర్చంట్..
ఇదిలా ఉంటే.. లక్షల హృదయాలను కొల్లగొట్టిన త్రిప్తి.. లవర్ సామ్ మర్చంట్ గురించి ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. ఎవరు ఈ సామ్ అని నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. సామ్ మర్చంట్ మొదట్లో మోడల్‌గా చేశాడు. ప్రస్తుతం బిజినెస్‌లో రాణిస్తున్నాడు. గోవాలో ఇతనికి బీచ్ క్లబ్స్‌తోపాటు పలు హోటళ్లు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉంటే.. త్రిప్తి, సామ్ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఇద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు.