Patriotic Movies: 1947 ఆగస్టు 15 ప్రతి భారతీయుడు జీవితాంతం గుర్తు పెట్టుకునే రోజు, శతాబ్దాలపాటు ఇంగ్లీష్ వాళ్ళ పాలనలో మగ్గిన భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని స్వరాజ్యం సాధించిన రోజు. ఎందరో మహానుభావుల త్యాగాల కు గుర్తు మన స్వాతంత్రం. అందుకే ఆగస్టు 15 అంటే కేవలం ఒక తేదీ మాత్రమే కాదు. ఒక దేశం సగౌరవంగా తలెత్తుకున్న సందర్భం, కోట్ల మంది భారతీయుల హృదయాలు ఉప్పొంగే రోజు.
ఇక భారతీయ సినీ ఇండస్ట్రీలో కూడా దేశభక్తితో అనేక సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు తారతమ్య బేధాలు లేకుండా ప్రతి ఒక్కరి గుండెను దేశభక్తి భావంతో నింపాయి. కొన్ని దేశభక్తి సినిమాలు ప్రేక్షకులు గర్వపడేలా చేశాయి. 77 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అలాంటి గొప్ప సినిమాల్లో కొన్నిటిని చూద్దాం.
RRR (2022) : 1920 లో భారతదేశ స్వేచ్ఛ కోసం పోరాడిన ఇద్దరు తెలుగు వీరుల గురించి తీసిన సినిమా. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు కలిసి పోరాడితే ఎలా ఉంటుందో, ఇద్దరు కలిసి బ్రిటిష్ వారి భరతం ఎలా పట్టారో చూపించిన సినిమా.
మేజర్ (2022) : అడవి శేషు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2008 ముంబై దాడులలో మరణించిన భారతీయ సైనికుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి తీసిన సినిమా. ముంబై దాడుల సమయంలో అతను చేసిన త్యాగాల గురించి చూపిస్తుంది. ఈ సినిమాకు కనెక్ట్ కానీ భారతీయుడు లేడనే చెప్పాలి.
ఖడ్గం (2002) : 1990 లో ముంబై లో జరిగిన దాడుల గురించి తీసిన సినిమా. పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన దాడులను చూపించిన సినిమా. 20 వ దశకం మొదటి లో దేశభక్తి ని చాటిన సినిమా ఇది. రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.
ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002) : భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి అతి చిన్న వయస్సులోనే ప్రాణాలను కోల్పోయిన వీరుడు భగత్ సింగ్ గురించి తీసిన సినిమా. అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమా భగత్ సింగ్ యొక్క త్యాగాలను చూపిస్తుంది.
గదర్ – ఏక్ ప్రేమ్ కథ (2001) : 1947లో భారత దేశ విభజన జరిగిన సమయంలో ప్రేమించుకున్న ఒక హిందూ- ముస్లిం యువతి యువకుల గురించి తీసిన సినిమా.
భారతీయుడు (1995) : భారతదేశంలో బాగు కోసం, లంచాలు లేని స్వచ్ఛమైన సమాజం కోసం పోరాడిన ఒక స్వాతంత్ర సమరయోధుడు కథ ఈ సినిమా. దేశం కోసం సొంత కొడుకునే చంపిన నిజమైన దేశభక్తుడి కథ. ఇందులో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు .
ఇలా చెప్పుకుంటే ఎన్నో గొప్ప సినిమాలు దేశభక్తి ప్రధానంగా తెరకెక్కాయి. దేశభక్తి పెంపొందిచటంలో సినీ పరిశ్రమ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది