Super Star Krishna Funeral: సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఒకే సంవత్సరంలో ముగ్గురు దూరం కావడంతో మహేశ్ బాబు జీర్ణించుకోలేకపోతున్నారు. దుఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. అయినా కన్నీటిని అదిమిపెట్టుకుని వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. జనవరిలో అన్న సెప్టెంబర్ లో తల్లి, ఇప్పుడు తండ్రి మరణించడం నిజంగా వారి ఇంట్లో తీవ్ర విషాదమే. కృష్ణ మరణం అందరిని కలచివేసింది. తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన రాజుగా ఆయన ఖ్యాతి అజరామరం. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మంగళవారం తిరిగిరాని లోకాలకు వెళ్లడం ఆవేదనకు గురి చేస్తోంది.

కృష్ణ అంత్యక్రియలపై మహేశ్ బాబు కుటుంబం ఓ ప్రకటన చేసింది. ఎందరిలో స్ఫూర్తి నింపిన మహనీయుడు కృష్ణ ఇక లేరనే విషయం ఎంతో విషాదం నింపింది. దీంతో ఆయనకు కన్నీటి వీడ్కోలు చెప్పేందుకు మహేశ్ బాబు కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. రేపు మధ్యాహ్నం గచ్చిబౌలి స్టేడియం నుంచి మహాప్రస్థానం వరకు ర్యాలీగా తరలివెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుందని కేసీఆర్ చెప్పడంతో అధికారులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కృష్ణ పార్థివ దేహాన్ని నానక్ రామ్ గూడలోని ఇంటి నుంచి గచ్చిబౌలి స్టేడియానికి సాయంత్రం తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. బుధవారం మధ్యాహ్నం అంతిమ సంస్కారాలు జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఆయన అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తెలుగు సినిమా రంగాన్ని శోక సంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిన కృష్ణ కు పలువురు నీరాజనాలు అందిస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరనే వార్త అందరిని వేదనకు గురిచేస్తోంది. ఆయన అభిమానులు వేలాదిగా తరలి వస్తూ తమ ప్రియతమ నటుడికి తుది వీడ్కోలు చెబుతున్నారు. ఇన్నాళ్లు తమ మనసుల్లో నిలిచిపోయిన ధ్రువతార నింగికేగడం జీర్ణించుకోలేకపోతున్నారు. సూపర్ స్టార్ గా ఎదిగే క్రమంలో కృష్ణ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. నిర్మాతల మనిషిగా ఆయన ఎంతో ఆరాధ్యుడిగా నిలిచారు. సినిమా అపజయం పాలైతే వెంటనే ా నిర్మాతకు మరో సినిమా చేసి లాభాలు వచ్చేలా చేసేవారని కీర్తిస్తున్నారు. అలా చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణ ఇక తిరిగిరారనే వార్త అందరిలో శోకం నింపుతోంది.