Prabhas: ఇంస్టాగ్రామ్ వేదిక ప్రభాస్ చేసిన కామెంట్ పలు అనుమానాలకు దారితీసింది. ముఖ్యంగా ఆయన వివాహం చేసుకోబోతున్నారంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ‘డార్లింగ్స్ … ఎట్టకేలకు ఓ ప్రత్యేకమైన వ్యక్తి మన జీవితంలోకి వస్తుంది, వేచి చూడండి’ అని కామెంట్ పెట్టారు. ఎట్టకేలకు ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పడంతో… ఆ వ్యక్తి ప్ ప్రభాస్ కి కాబోయే భార్య అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ వివాహం కొరకు ఏళ్లుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ ప్రస్తుత వయసు 44 ఏళ్ళు. ఇప్పటికి పెళ్ళై పిల్లలు కూడా ఉండాలి. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వివాహం చేసుకుని తల్లిదండ్రులు కూడా అయ్యారు. ప్రభాస్ పెళ్లి మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేస్తానంటున్న ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ ఊహాగానాల మీద ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి స్పందించారు. ఆమె ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అమ్మాయి ఎవరు? అని యాంకర్ శ్యామలాదేవిని అడిగారు. ఆ విషయాలు చెప్పను కానీ… త్వరలో గుడ్ న్యూస్ వింటారు. ఈ ఏడాదే ప్రభాస్ వివాహం ఉంటుంది. పైన ఉన్న కృష్ణంరాజు ఆశీస్సులు ఎప్పుడూ ప్రభాస్ కి ఉంటాయి. ఆయన మమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయన ప్రభాస్ ని ఓ ఇంటివాడిని చేయబోతున్నాడు.. అని శ్యామలాదేవి అన్నారు. అయితే గతంలో కూడా శ్యామలాదేవి పలుమార్లు ఇదే తరహా కామెంట్స్ చేశారు. అవి కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు.
అలాగే ప్రభాస్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ కూడా ఆయన లేటెస్ట్ మూవీ కల్కి 2829 AD గురించి అంటున్నారు. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ సదరు కామెంట్ చేశాడన్న వాదన వినిపిస్తోంది. జూన్ 27 కల్కి విడుదల తేదీగా ప్రకటించారు. మరలా వాయిదా పడనుందని సమాచారం. నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి తెరకెక్కిస్తున్నాడు. దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ , దిశా పటాని వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.