Romantic: పెద్ద హీరోలకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి.. ప్రస్తుతం యంగ్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నారు ఆకాశ్ పూరి. పూరి జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశ్ పూరి హీరోగా అనిల్ పాడూరి దర్శకత్వంలో రానున్న సినిమా రొమాంటిక్. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే అక్టోబరు 29న విడుదల కానున్న నేపథ్యంలో మరో ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రొమాంటిక్ బ్యాడ్ యాస్ పేరుతో విడుదలైన ఈ ట్రైలర్లో ఆకాశ్ పూరీ పాత్ర గురించి చూపించారు. ‘‘మై నేమ్ ఈజ్ వాస్కోడిగామా.. ఏక్ దిన్ యే బచ్చా.. సబ్ కా బాప్ బనేగా’’, ‘‘పుట్టింది పడుకోవడానికి కాదు. చనిపోయాక పడుకో’’ అంటూ ఆకాశ్ చెప్పే మాస్ డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రముఖ నటి రమ్యకృష్ణ ఇందులో రమ్య గొవార్కర్ అనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పాత్రలో అలరించనున్నారు.
గోవా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే గ్యాంగ్‌స్టర్లు.. అందులోని ఓ కుర్రాడి ప్రేమకథతో ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో కేతికా శర్మ హీరోయిన్. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి కథ, కథనం సంభాషణలు అందించారు. పూరి, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ మాట్లాడుతూ.. యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలిపారు. భావోద్వేగభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఎప్పుడూ ఏడవని పూరి.. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు.