Dwarakish: “ఆడు ఆట ఆడు” 90వ దశకంలో కన్నడ చిత్ర పరిశ్రమను ఈ పాట ఒక ఊపు ఊపింది. అప్పట్లో ఈ పాటను చూసేందుకే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. ఈ పాటను పాడింది ప్రముఖ హిందీ గాయకుడు కిషోర్ కుమార్. ఆయనను కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది దర్శకుడు ద్వార కీష్.. కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా బహు పాత్రలు పోషించి.. ప్రేక్షకులను అలరించారు ద్వారకీష్.. 81 సంవత్సరాల ఈ కన్నడ సినీ దిగ్గజం మంగళవారం గుండెపోటుతో కన్నుమూశాడు.
ద్వారకీష్ అసలు పేరు బంగల్ షామారావు ద్వారకానాథ్. ఆగస్టు 1942 లో మైసూర్ జిల్లాలోని హున్ సూర్ ప్రాంతంలో జన్మించాడు. మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేశాడు. సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో యుక్త వయసులోనే బెంగళూరు వచ్చేసాడు. చిన్నా చితకా వేషాలు వేసుకుంటూనే నటుడుగా స్థిరపడ్డాడు. ఆర్థికంగా పర్వాలేదు అనుకున్న తర్వాత దర్శకుడు అవతారం ఎత్తాడు. అనంతరం నిర్మాతగా మారాడు. హాస్య పాత్రలకు ద్వారకీష్ పెట్టింది పేరు. అలవోకగా కామెడీని పండిస్తాడు. దర్శకుడిగానూ కన్నడ ప్రేక్షకులను మెప్పించాడు. నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలను నిర్మించాడు.
1966లో తుంగ పిక్చర్స్ పేరుతో బ్యానర్ స్థాపించాడు. కర్ణాటకలో తుంగభద్ర నది ప్రవహిస్తుంది కాబట్టి.. పైగా మైసూర్ ప్రాంతానికి ఆ నది ప్రవాహం అత్యంత ముఖ్యం కాబట్టి.. ఆ నది పేరులోని మొదటి రెండు అక్షరాలను తన బ్యానర్ పేరుగా రూపొందించాడు. 1966లో “మమతేయ బంధన” అనే చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాడు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్, భారతి ప్రధాన పాత్రల్లో నటించిన మేయర్ ముత్తన్న అనే సినిమాతో నిర్మాతగా అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఆ రోజుల్లో ఈ సినిమా కర్ణాటక రాష్ట్రంలో సంవత్సరం పాటు ప్రదర్శించారట. అంబరీష్, శివన్న వంటి వారితోనూ చిత్రాలు నిర్మించాడు.. ఎక్కువగా హాస్యం, కుటుంబ కథలకు ద్వారకీష్ ప్రాధాన్యం ఇచ్చేవాడు. అలా రూపొందించిన సినిమాలు ఆ కాలంలో విజయవంతమయ్యాయి. ద్వారకీష్ ను పెద్ద నిర్మాతను చేశాయి.ద్వారకీష్ మరణం పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది. సుప్రసిద్ధ నటులు ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్, ఇతర ప్రముఖులు ద్వారకీష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.