Balakrishna: నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఆయన పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉంటుదో.. విలన్ కూడా అంతే ధీటుగా ఉండేలా ప్లాన్ చేస్తారు దర్శకులు. లెజెండ్ సినిమాలో జగపతి బాబును ఆ క్యారెక్టర్ ఆయన జీవితాన్ని ఎలా మలుపుతిప్పిందో అందరికీ తెలిసిందే. అయితే, బాలయ్య ఫ్యూచర్లో తన సినిమా కోసం సీనియర్ హీరో మోహన్ బాబును విలన్‌గా చూపించేందుసు సిద్ధమయ్యారు.
ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 11:20 గంటలకు ఆహాలో తొలి ఎపిసోడ్ ప్రసారం అయ్యింది.షోలో నందమూరి బాలకృష్ణ ‘పైసా వసూల్’ సాంగ్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్రడక్షన్ డైలాగ్స్, డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఆయన కాస్ట్యూమ్‌లు అత్యద్భుతంగా ఉన్నాయి. ఇందులో తొలి గెస్ట్‌గా మంచు మోహన్ బాబు వచ్చారు. ఆయనతో పాటు విష్ణు, లక్ష్మీ కూడా అతిథులుగా వచ్చారు. ఈ క్రమంలోనే షోలో భాగంగా బాలయ్య మోహన్‌బాబు పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. అలా తన సినిమాలో విలన్‌గా నటిస్తారా అని బాలయ్య అడగ్గా.. తనకు విలన్‌గా నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు మోహన్‌బాబు.
ఈ క్రమంలోనే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ బిగ్స్క్రీన్పై చూసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి వీరిద్దరి కోసం ప్రేక్షకులను మెప్పించే కథను సిద్ధం చేసుకుని పట్టాలెక్కించే దర్శకుడెవరో తెలియాలంటే ఇకొన్నిరోజులు వేచి చూడక తప్పదు.