40 Years of Khaidi: ఖైదీ మూవీ కి 40 ఏళ్లు.. అప్పట్లోనే రికార్డులు బద్దలు.. చిరంజీవి స్పెషల్ మూవీ గురించి ఆసక్తికర అంశాలు

ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్ నే మలుపు తిప్పిన సినిమా. ఈ సినిమా అక్టోబర్ 28, 1983 లో విడుదలైంది. అంటే 40 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ సినిమా. ముందుగా ఈ సినిమా చిరు వద్దకు రాలేదట.

Written By: Neelambaram, Updated On : October 30, 2023 2:09 pm
Follow us on

40 Years of Khaidi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నటించిన సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలం కావనే చెప్పాలి. ఎన్నో హిట్లు, కొన్ని మాత్రమే ఫ్లాప్ ల రికార్డు చిరు సొంతం. అయితే అన్ని సినిమాల్లో ఖైదీ సినిమా మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం అని చెప్పాల్సిందే. చాలా స్టార్ల కెరీర్ లో కూడా ఏదో ఒక సినిమా అనుకోని హిట్ ను అందించి.. ఆ సినిమాతోనే కెరీర్ మలుపు తిరిగేలా చేస్తుంది. ఇక చిరు లైఫ్ లో ఖైదీ సినిమా కూడా అలాంటి ఇమేజ్ ను అందించింది. అసలు ఈ సినిమా చిరు కెరీర్ లో తెచ్చిన మార్పులేంటి? ఈ సినిమా వచ్చినప్పుడు చిరు కెరీర్ ఏంటి? ఈ స్టార్ మార్కెట్ ఎంత? అనే వివరాలు ఇప్పుడు మీకోసం..

ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్ నే మలుపు తిప్పిన సినిమా. ఈ సినిమా అక్టోబర్ 28, 1983 లో విడుదలైంది. అంటే 40 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ సినిమా. ముందుగా ఈ సినిమా చిరు వద్దకు రాలేదట. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ చేయాల్సిన సినిమా ఖైదీ. కానీ అనుకోకుండా కోదండరామిరెడ్డి, చిరు కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలకు మించి హిట్ ను అందుకుంది. అయితే 1982లో వచ్చిన అమెరికన్ సినిమా ఫస్ట్ బ్లడ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

మొత్తం మీద ఈ సినిమాతో చిరంజీవి మాత్రం స్టార్ హోదాను సొంతం చేసుకున్నారు. అప్పట్లోనే ఖైదీ సినిమా కోసం రూ. 1,75,000 రెమ్యూనరేషన్ అందుకున్నారట చిరు. ఇదిలా ఉంటే కృష్ణ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సినిమా 100 రోజుల వేడుకకు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు కృష్ణ. ఆ రోజుల్లోనే ఈ సినిమాకు 3.2 కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే సినిమా రేంజ్ ను అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో 4 కోట్ల వరకు షేర్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది చిరు సినిమా. 20 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ఆడిన ఖైదీ సినిమా మెగాస్టార్ కు చాలా స్పెషల్. ఈ రేంజ్ లో సినిమా హిట్ అవడంతో తర్వాత కూడా ఖైదీ నెం 786 అనే పేరుతో మరో సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించింది. అంతేనా పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమాకు కూడా ఖైదీ నెం 150 టైటిల్ పెట్టారంటే ఆ ఈ సినిమా పై చిరుకు ఉన్న అభిమానం ఏంటో అర్థం చేసుకోవచ్చు.