Producer Kamal Mishra: బాలీవుడ్ నిర్మాత కమల్ మిశ్రా దారుణానికి పాల్పడ్డారు.కట్టుకున్న భార్యను కారుతో గుద్ది తొక్కించారు. ఆమె కాళ్లపై నుండి కారు నడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఈ దారుణ ఘటన సీసీ టీవీ కెమెరాలలో నమోదైంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అక్టోబర్ 19న జరిగిన ఈ ప్రమాదంలో కమల్ మిశ్రా భార్య గాయాలపాలయ్యారు. తనను కారుతో తొక్కించిన భర్తపై భార్య కేసు పెట్టారు.

అందుతున్న సమాచారం ప్రకారం… కమల్ మిశ్రా భార్య అతన్ని వెతుక్కుంటూ ముంబై అంధేరీ వెస్ట్ లో గల ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చారు. అక్కడ కారులో మరొక మహిళతో కమల్ మిశ్రా ఉండటం గమనించారు. దీంతో ఆమె వాదనకు దిగారు. ఆ మహిళ ఎవరు, ఆమెతో మీకున్న సంబంధం ఏమిటో చెప్పాలని పట్టుబట్టారు. మహిళతో పాటు అక్కడి నుండి కారులో వెళ్లిపోవాలని కమల్ మిశ్రా ప్రయత్నం చేశారు.
పారిపోతున్న భర్తను ఆపేందుకు ఆమె కారుకు అడ్డుగా నిలుచున్నారు. కమల్ మిశ్రా కారుతో ఆమెను గుద్దడంతో క్రింద పడిపోయారు. ఆమె మీదుగా కారును మిశ్రా నడపడం జరిగింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ వెంటనే స్పందించి కారు క్రింద ఉన్న కమల్ మిశ్రా భార్యను బయటకు లాగారు. లేకుంటే మరింత ప్రమాదం జరిగేది. కారు ముందు చక్రాల క్రిందపడిన ఆ మహిళ గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన మొత్తం సీసీ కెమెరాలలో నమోదైంది.

అంబోలి పోలీస్ స్టేషన్ లో కమల్ మిశ్రా పై కేసు నమోదైంది. బాలీవుడ్ నిర్మాతగా ఉన్న కమల్ మిశ్రా 2019లో ‘శర్మ జీకే లగ్ గయీ’ అనే కామెడీ మూవీ నిర్మించారు. అలాగే దేహతి డిస్కో టైటిల్ తో మరో మూవీ నిర్మించారు. భార్యను కారుతో తొక్కించిన కమల్ మిశ్రాపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఈ సంఘటనను ఖండిస్తున్నారు. కమల్ మిశ్రాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.