https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే పని కాదంటూ ఎగతాళి.. ఆఖరుకు విన్నర్ గా పల్లవి ప్రశాంత్ విజయం

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో కు వెళ్లాలని ఆసక్తితో చేసిన వీడియోలు కాస్త వైరల్ గా మారడంతో పాటు ట్రెండింగ్ అయ్యాయి. తను పడిన కష్టానికి ప్రతిఫలంగా బిగ్ బాస్ సీజన్ -7 కోసం బీబీ టీమ్ పల్లవి ప్రశాంత్ ను సంప్రదించింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 18, 2023 / 02:48 PM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 టైటిల్ విన్నర్ గా నిలిచారు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన యూట్యూబర్ గా జీవితాన్ని మొదలు పెట్టారన్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ వేదికగా ఫోక్ సాంగ్స్ క్రియేటర్ గా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ సరికొత్త ట్రెండ్ సృష్టించారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

    సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కొల్గూరు గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువకుడు పల్లవి ప్రశాంత్. ఆయన తండ్రి రైతు. డిగ్రీ వరకూ చదువుకున్న ప్రశాంత్ చిన్నతనం నుంచి కల్చరల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా పాలుపంచుకునే వారు. ఆ ఇంట్రెస్ట్ తోనే కొంతమంది స్నేహితులతో కలిసి యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. ఫోక్ సాంగ్స్ తో నెటిజన్లకు చేరువయ్యారు. అయితే స్నేహితులతో వివాదాలు రావడంతో యూట్యూబ్ ఛానల్ ను పల్లవి ప్రశాంత్ వదులుకోవాల్సి వచ్చిందంట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారని తెలుస్తోంది. అయితే తన తండ్రి తనకు అండగా నిలిచారని.. నువ్వు ఏదీ చేయాలనుకుంటే అది చెయ్ అని చెప్పడంతో పల్లవి ప్రశాంత్ తన మనసును మార్చుకున్నారట.

    తరువాత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిన పల్లవి ప్రశాంత్ రైతు సమస్యలపై వీడియోలు తీస్తూ మరోసారి అభిమానులకు దగ్గర అయ్యారు.. అన్నా.. రైతుబిడ్డను.. మళ్లొచ్చినా అంటూ తనదైన శైలితో నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో అంటే ఇష్టమున్న పల్లవి ప్రశాంత్ ఎప్పటికైనా ఆ షోకు వెళ్తానంటూ వీడియోలు షేర్ చేస్తూ ఉండేవారన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలు అవుతుందని తెలియగానే అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరిగే వారట ఆయన.. అలా గత రెండు సీజన్ లలో ప్రయత్నించినా నిరాశ ఎదురైంది. ఇదే విషయంపై తన స్నేహితులు ఎప్పుడూ ఎగతాళి చేసేవారట..నువ్వు బిగ్ బాస్ షోకి వెళ్లడమా.. జరిగే పని కాదులే అని నవ్వేవారట. కానీ ఎన్ని అవమానాలు ఎదురైనా ఎగతాళిని సైతం ఎదుర్కొంటూ వీడియోస్ ను చేస్తూనే ఉండేవారు పల్లవి ప్రశాంత్..

    పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో కు వెళ్లాలని ఆసక్తితో చేసిన వీడియోలు కాస్త వైరల్ గా మారడంతో పాటు ట్రెండింగ్ అయ్యాయి. తను పడిన కష్టానికి ప్రతిఫలంగా బిగ్ బాస్ సీజన్ -7 కోసం బీబీ టీమ్ పల్లవి ప్రశాంత్ ను సంప్రదించింది. దీంతో కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేసిన ఆయన తండ్రి ఇచ్చిన రూ.500 లతో హైదరాబాద్ కు వచ్చారు. బిగ్ బాస్ షో కోసం ఆడిషన్స్ ఇచ్చి రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు.

    అంతేకాదు బిగ్ బాస్ సీజన్ -7 సందర్భంగా హౌస్ లోకి అడుగుపెట్టే ముందు తన పొలంలోని మట్టితో పాటు పండించిన బియ్యాన్ని హోస్ట్ నాగార్జున కు బహుమతిగా ఇచ్చారు పల్లవి ప్రశాంత్. ఈ సందర్భంలోనే నాగార్జున సైతం పల్లవి ప్రశాంత్ కు ఓ మిరప మొక్కను కానుకగా ఇచ్చారు. దానికి కాయలు కాస్తే దానికి తగ్గట్లుగా స్పెషల్ గిఫ్ట్ లు కూడా ఇస్తానని చెప్పడం గమనార్హం. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తరువాత తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అంతేకాదు మొదటి కెఫ్టన్ గా నిలవడం విశేషం..కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ సీజన్-7 విజేతగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు.