Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించింది. వేణు స్వామి హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతుంటాడు. అలాగే కెరీర్ లో ఎదగాలని కొందరు సెలెబ్రెటీలు వేణు స్వామి తో పూజలు జరిపించుకుంటారు. ఇక తాజాగా అషు రెడ్డి కూడా వేణు స్వామిని ఆశ్రయించింది. వేణు స్వామి గత కొంత కాలంగా సెలబ్రెటీల పర్సనల్ లైఫ్ ని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేస్తూ .. వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారాడు.
గతంలో వేణు స్వామి ప్రభాస్ గురించి చెప్పిన స్టేట్మెంట్స్ ఎంత వైరల్ గా మారాయో తెలిసిందే. దీంతో వేణు స్వామి పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడ్డారు.ప్రభాస్ ఫ్యాన్స్ – వేణు స్వామి మధ్య సోషల్ మీడియాలో వార్ నడిచింది. ఎవరు ఏమన్నా నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అంటూ వేణు స్వామి చెప్తుంటాడు. తనకు ఎవరి మీద ద్వేషం లేదని, కేవలం వారి జాతకం ప్రకారం అంచనా వేసుకుని చెప్తున్నాను అని పలు సందర్భాల్లో వేణు స్వామి తెలిపారు.
కాగా వేణు స్వామిని విమర్శించే వారు కొందరైతే, ఆయన భక్తులు చాలా మంది ఉన్నారు. వారిలో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. గతంలో రష్మిక మందన్న, డింపుల్ హయాతి, నిధి అగర్వాల్, ఇనాయ సుల్తానా వంటి వారు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.ఇక తాజాగా ఈ లిస్ట్ లో అషు రెడ్డి చేరింది. అషు రెడ్డి కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ తో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తాజాగా అషురెడ్డి తన ఇంట్లో వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించింది. అషు రెడ్డి బగళాముఖీ దేవి, రాజ శ్యామలా దేవికి పూజలు చేయించినట్టుగా తెలుస్తుంది. ఈ పూజా వీడియోను అషు రెడ్డి షేర్ చేసింది. సదరు వీడియోలో వేణు స్వామి కాళ్లకు మొక్కుతూ కనిపించింది. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేణు స్వామి పూజల పట్ల అషురెడ్డికి ఎంత నమ్మకమో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.