HBD Allu Arjun: సగటు ప్రేక్షకుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే ఒకే ఒక మాధ్యమం సినిమా… ఆ ప్రేక్షకుడి హృదయం లో చోటు సంపాదించుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇక్కడ గెలవాలంటే మొండిగా పోరాడాలి, గుండె దైర్యం తో పరుగెత్తాలి, అనుక్షణం పోరాటం చేస్తూ ముందుకు సాగాలి. ‘రగిలే నిప్పు రవ్వ కు ఒక పెద్ద అడవిని సైతం దహించేంత శక్తి ఉంటుంది. అలాగే అయిదున్నర అడుగుల ఎత్తు తో సాధారణ మనిషి లా కనిపించే మనలో ప్రపంచాన్ని జయించగలననే ఒక చిన్న ఆశ నిప్పు రవ్వలా మండుతూ ఉన్నప్పుడే, ఇక్కడ గెలుపు మనల్ని తన భుజాల మీద నిల్చోపెడుతుంది’.. అలాంటప్పుడే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాం. ఇవేమీ లేకుండా సక్సెస్ అవ్వడం అంటే కుదరని పని. ఇక్కడ ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా టాలెంట్ ఉన్నోడు మాత్రమే ఇక్కడ హీరోగా సక్సెస్ అవుతాడు అనేది మనం చాలామంది పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల విషయంలో ప్రత్యేక్షం గా చూశాం…
ఇక అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తను చేసిన ‘గంగోత్రి ‘ సినిమాతోనే ఒక మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు. కానీ ఆ సినిమాలో అతన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు ఇతను హీరో ఏంటి? హీరో అంటే ఇలా ఉంటాడా? హీరో కు ఉండాల్సిన ఒక్క క్వాలిటీ అయిన తనకు ఉందా? ఆయన చూడడానికి కూడా అంత అందంగా లేడు. అయిన కూడా ఇతన్ని హీరోగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. నాన్న లా దగ్గర డబ్బులు ఉంటే కొడుకులు ఇజీ గా హీరోలు అయిపోవచ్చా? అంటూ ఆయన మీద విపరీతమైన విమర్శలను చేశారు. అయినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం వాటిని పట్టించుకోలేదు. హీరోగా సినిమా ఇండస్ట్రీలో తన పేరుని సువర్ణక్షరాలతో లిఖించుకోవాలి అనే ఒక దృఢ సంకల్పాన్ని తన మైండ్ లో పెట్టుకొని అటు వైపు గా అడుగులు వేశాడు. ఇక ఆ క్రమంలోనే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఆర్య సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘ఫీల్ మై లవ్’ అని ఆయన చెప్పిన డైలాగ్ యూత్ లో ఒక జపం లాగా మారిపోయింది.
ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా అప్పుడున్న యంగ్ హీరోల్లో అద్భుతంగా డ్యాన్సులు వేయడంలో ఈయనను మించిన వారు మరొకరు లేరు అనేంతలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ‘స్టైలిష్ స్టార్’ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన వరుస సినిమాల్లో అతని నటన లో వైవిధ్యాన్ని చూపిస్తూ సక్సెస్ లు సాధిస్తూ వచ్చాడు. అందం పరంగా కూడా చాలా కేర్ ని తీసుకుని ఒక హీరో అవ్వాల్సిన వాడు ఎలా ఉండాలి అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆయన బాడీని మేకోవర్ చేస్తూ వచ్చాడు.
సిక్స్ ప్యాక్ అంటే బాలీవుడ్ వాళ్ళు మాత్రమే చేస్తారు. తెలుగు హీరోలకి చేతకాదు అని ఎవరో అనేటప్పుడు అల్లు అర్జున్ విన్నాడట. ఇక దాంతో దేశముదురు సినిమా కోసం మొదటిసారిగా సిక్స్ ప్యాక్ చేసి తెలుగు హీరోలు కూడా ఎవరి కంటే తక్కువ కాదు అని నిరూపించిన మొదటి హీరో కూడా అల్లు అర్జున్ కావడం విశేషం… ఇక బద్రీనాథ్ లాంటి ఫ్లాప్ సినిమా కోసం ఆయన దాదాపు సంవత్సరం పాటు డైట్ ఫాలో అవుతూ, సరిగ్గా తినకుండా, సరిగ్గా నిద్రపోకుండా చాలా ఇబ్బందులను పడుతూ ఆ సినిమా కోసం చాలా పర్ఫెక్షన్ తో అనుక్షణం కష్టపడ్డాడు. అల్లు అర్జున్ తో సినిమాలు చేసిన దర్శకులు ప్రతి ఒక్కరు ఆయన పర్ఫెక్షన్ కి ఫిదా అయిపోతూ ఉంటారు. ఇలా ఆయన కెరియర్ లో ఎన్నో ఛీత్కారాలు, ఎన్నో ఒడుదొడుకులు, ఎన్నో విమర్శలు,ఎన్నో ఎదుగుదెబ్బలు వీటన్నింటినీ ఎదిరించి ప్రస్తుతం స్టార్ గా తన స్థాయిని తనే నిర్ణయించుకున్నాడు.
ఒక వ్యక్తి ముందుకు వెళ్తుంటే ఆయన్ని వెనక్కి లాగడానికి 100 మంది ప్రయత్నం చేస్తారు. కానీ మనం మైండ్ లో ఏదైతే ఫిక్స్ అయ్యామో దానికోసమే మనం ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించిన వ్యక్తి అల్లు అర్జున్… నిజానికి నాన్నలు ప్రొడ్యూసర్లు అయినప్పుడు మన జేబులో ఖర్చు పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ అమౌంట్ ఉంటుంది, మన బ్యాంకులో బతకడానికి కావాల్సిన దానికంటే ఎక్కువ మనీ ఉంటుంది. దానివల్ల నాకేంటి, నేను ఎందుకు కష్టపడాలి అనే ఒక ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ మా నాన్న డబ్బుతో నాకు సంబంధం లేదు. నాకంటూ నేను ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలి అనే ఉద్దేశ్యంతోనే అల్లు అర్జున్ ఈరోజు ఈ స్థాయిలో ‘ఐకాన్ స్టార్’ గా పాన్ ఇండియాలో అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రభంజనాన్ని చూడడానికి యావత్ భారతదేశం మొత్తం సిద్ధంగా ఉంది…ఎక్కడో మొదలైన అల్లు అర్జున్ ప్రయాణం ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో కోట్ల మంది ఫ్యాన్స్ ని సంపాదించుకోవడం వరకు వచ్చింది. ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు’ అని చెప్పినట్టుగానే కష్టపడే తత్వం ఉంటే ప్రతి ఒక్కరు స్టార్లుగా ఎదుగుతారు అని అల్లు అర్జున్ నిరూపించాడు…ఇన్ని దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్క స్టార్ హీరోకి సాధ్యం కానీ నేషనల్ అవార్డు ను పుష్ప సినిమాతో ‘ఉత్తమ నటుడు’ క్యాటగిరిలో అల్లు అర్జున్ అందుకోవడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ఇక ఈరోజు 41 వ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్ ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం…