
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తేనెతుట్టెను కదిపారు. కొన్ని వెబ్ సైట్స్ పై యుద్ధం ప్రకటించారు. తనపై అనవసర గాసిప్పులు రాస్తున్నారని వీడియో విడుదల చేసి మరీ కడిగిపారేశారు. విజయ్ దేవరకొండకు మద్దతుగా టాలీవుడ్ కదిలింది. మహేష్ బాబు నుంచి కొరటాల వరకు చిరంజీవి సహా అందరూ మద్దతు పలికారు. ఆ నాలుగు వెబ్ సైట్స్ తీరును కడిగేశారు.
*వివాదం ఏంటి?
టాలీవుడ్ తెరపైకి దూసుకొచ్చిన విజయ్ దేవరకొండ తెరమీదే కాదు.. తెర బయట కూడా అంతే అగ్రెసివ్ గా ఉంటారని పేరుంది. కరోనా టైంలో ఉపాధి లేక తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్ ’ స్థాపించి అందులో మధ్యతరగతి ప్రజలకు తన సంస్థ ద్వారా సహాయం అందిస్తున్నాడు. దీనిపై తాజాగా కొన్ని వెబ్ సైట్లు తప్పుడు కథనాలు రాశాయి. తనను ఇంటర్వ్యూ అడిగారని.. ఇవ్వను అన్నందుకు కక్షగట్టి ఇలా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విజయ్ ఆరోపించారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో కొన్ని వెబ్ సైట్స్ రాసిన కథనాలు చదివి మరీ వాటిని కడిగిపారేశారు. ఇది వైరల్ అయ్యింది. ఈ విషయంలో టాలీవుడ్ మొత్తం కదిలివచ్చి విజయ్ కు అండగా నిలబడింది.
వైన్ షాపులో ఉపాధ్యాయుల డ్యూటీపై పవన్ సీరియస్!
*టాలీవుడ్ ఏకమైంది.. విజయ్ కు సపోర్ట్
కొన్ని వెబ్ సైట్స్ ఇష్టారీతిలో వార్తలు రాస్తూ తన ప్రతిష్టను దిగజార్చుతున్నాయంటూ టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రేపిన కామెంట్స్ టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి. ఆ వేడి మెల్లిగా అంటుకొని టాలీవుడ్ లో చల్లారడం లేదు. ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి విజయ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ సహా కొరటాల, హరీష్ శంకర్, చిరు, అనిల్ రావిపూడి, రవితేజ అల్లరి నరేష్ ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విజయ్ కు తమ మద్దతు ప్రకటించారు. తాజాగా నాగబాబు అయితే జలగల్లా మమ్మల్ని పట్టుకొని రక్తం తాగుతున్నారని ధ్వజమెత్తారు.
*అసలు నష్టం ఎవరికీ?
లాక్ డౌన్ విధించి 40 రోజులైంది. సినిమాలు, థియేటర్స్, షూటింగ్ లన్నీ బంద్ అయిపోయాయి. తారలంతా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపేస్తున్నారు. వారి నుంచి ఏం అప్డేట్స్ లేవు. బి ద రియల్ చాలెంజ్ లు ముగిసిపోయాయి. దీంతో ప్రధానంగా సినీ పరిశ్రమపై ఆధారపడి నడుస్తున్న కొన్ని వెబ్ సైట్స్ కు ఎలాంటి సినిమా వార్తలు లేకుండా పోయాయి. ఈ కారణంగా గాసిప్పుల పేరిట కొందరు రాసేశారు. ప్రేక్షకుల్లో వారి అభిమానుల్లో ఉత్సుకత రేపడానికి ఇలా గాసిప్పులు క్రియేట్ చేస్తుంటారు. ఇటీవల రాజమౌళి-మహేష్ సినిమా గురించి ఇలానే బోలెడు గాసిప్పులు పేల్చి సినీ ప్రేమికులను ఊహల్లో నింపారు. ఇక ఆర్ఆర్ఆర్ గురించి బోలెడన్నీ గాసిప్పులు వచ్చాయి. ఈ గాసిప్పులు ఆ సినిమాలపై అంచనాలు పెంచుతాయి. అభిమానుల్లో ఆసక్తి రేపుతాయి.
*ప్రమోషన్ కు వెబ్ సైట్స్ కావాలి.. విమర్శలకు వద్దా?
ఇలా తమకు ప్రమోషన్ గా పనికి రావడానికి వెబ్ సైట్స్ ను ఉపయోగించుకునే సినీ ప్రేమికులు.. వ్యతిరేకంగా రాస్తే మాత్రం విమర్శలు గుప్పించడం ఏమంత న్యాయమో అర్థం కానీ పరిస్థితి. సెలెబ్రెటీలపై, సినిమాలకు అసలు హైప్ తీసుకొచ్చేవే వెబ్ సైట్స్. వాటికి సహకరిస్తే మరింత మైలేజ్ వస్తుంది. రాజమౌళి టీవీ9కు ఇంటర్వ్యూ ఇవ్వబట్టే కదా.. ఆయన తరువాత మూవీ మహేష్ బాబుతో అని తెలిసింది. అలా మీడియా ఎప్పుడూ స్టార్ ను పైకిలేపుతుంది. ప్రేక్షకుల ఆసక్తి కోసం గాసిప్పులు సృష్టిస్తుంది. అయితే కించపరిచే వార్తలను అందరూ ఖండించాలి.. కానీ ప్రతీ గాసిప్పులో తప్పులు వెదకడం కరెక్ట్ కాదు.. సినిమాలు బాగుంటే ఇవే వెబ్ సైట్స్ నెత్తిన పెట్టుకొని హైప్ తీసుకొస్తాయి. అప్పుడు అవసరం అయ్యే వెబ్ సైట్స్ ఇప్పుడు టాలీవుడ్ కు కాకుండా పోయాయి.
*మీడియా-టాలీవుడ్ దూరంగా ఉంటే నష్టం ఎవరికి?
మీడియా ఏదైనా రాస్తుంది. వెబ్ సైట్స్ వారు గాసిప్పులు రాస్తుంటారు. వాటిని సానుకూల దృష్టికోణంలో చూస్తే ఏబాధ ఉండదు. పంతం పడితేనే కష్టం. రేపు సదురు హీరోల సినిమాలపై వార్తలు రాయకపోతే.. ప్రచారం చేయకపోతే జనాలు ఎలా చూస్తారు. ఎలా మూవీలకు వెళతారు? అంతిమంగా మీడియాతో పెట్టుకుంటే నష్టపోయేది టాలీవుడ్ తారలేననేందుకు చాలా ఉదాహరణలున్నాయి. అప్పట్లో ఆంధ్రజ్యోతి, టీవీ9, ఈనాడుపై విమర్శలు చేసిన పవన్ పై ఆ మీడియా బ్యాన్ విధించాయి. పవన్ వార్తలు ప్రచురించలేదనే ప్రచారం ఉంది. ఆయనను మీడియాలోనూ ఫోకస్ చేయలేదు. ఇప్పుడు అదే జరిగితే తారల గురించి జనాలకు తెలియదు. వారికే నష్టం. అందుకే హెల్దీ వాతావరణంలో ఇటు సినీ పరిశ్రమ.. అటు మీడియా కూడా నియంత్రణ పాటించి తారల వ్యక్తిగత దూషణ కాకుండా మంచి గాసిప్పులతో ముందుకెళ్తే ఇరువురికి లాభమే.. ఇక్కడ ఎవరి వల్ల ఎవరూ బతకడం లేదనే విషయాన్ని గుర్తించుకొని వెళితేనే ఇద్దరికీ మనుగడ..