సినిమా ఇండస్ట్రీ ఏదైనా.. అగ్ర తాంబూలం హీరోలదే. డైరెక్టర్ అనేవాడు ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అని ఘనంగా చెప్పుకున్నా.. ఘనమైన రెమ్యునరేషన్ మాత్రం హీరోలదే. పాతికేళ్ల కింద వరకు సినిమాకు వెళ్లి వచ్చే ప్రేక్షకుల్లో.. పది శాతం మందికి కూడా దర్శకుడు ఎవరన్నది తెలిసేది కాదు. కానీ.. ఇప్పటి లెక్క వేరే. హీరో ఎవరన్నదానితోపాటు దర్శకుడిని చూసి కూడా సినిమాకు వెళ్లే పరిస్థితి వచ్చేసింది. ఈ విధంగా.. తెరచాటున ఉండే దర్శకుడు.. క్రమంగా తెరపైకి వచ్చేస్తున్నాడు. దీంతో.. ఆ మేరకు వాళ్ల పారితోషికం కూడా రెట్టింపు అవుతోంది. మరి, ఇప్పుడు టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ ఎవరు? వాళ్ల రెమ్యునరేషన్ ఎంత అన్నది చూద్దాం.
రాజమౌళిః ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ డైరెక్టర్ గా వెలిగిపోతున్నాడు రాజమౌళి. ఇప్పటి వరకు ఒక్క ప్లాఫ్ కూడా లేకుండా సినిమాలు తెరకెక్కించడం ఒకెత్తయితే.. ఇంతింతై అన్నట్టుగా ఆయన సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి విజయాలు సాధిస్తూ.. పై పైకి వెళ్తుండడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో జక్కన్న పారితోషికం కూడా పెరిగిపోతోంది. అయితే.. రాజమౌళి లెక్కలు సినిమా బడ్జెట్ పై ఆధారపడి ఉంటాయి. 100 కోట్ల బడ్జెట్ చిత్రం అయితే.. 15 కోట్లు తీసుకుంటాడని టాక్. అలా ఎన్ని కోట్లు పెరిగితే ఆ మేరకు డబుల్ అవుతోంది. ఇప్పుడు RRR సినిమాకు లాభాల్లో కూడా వాటా తీసుకుంటున్న నేపథ్యంలో.. సినిమా ఘనంగా ఆడితే.. వంద కోట్లు ముట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
త్రివిక్రమ్ః సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. కొంత కాలంగా రాజమౌళి తరహాలోనే లాభాల్లో వాటా తీసుకుంటున్నాడు. నిర్మాత రాధాకృష్ణ బ్యానర్ హారిక – హాసిని సంస్థలోనే సినిమాలు తీస్తున్నారు. ఆయన గత చిత్రం అలవైకుంఠ పురములో భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో వచ్చే సినిమాకు 25 కోట్ల వరకు తీసుకునే ఛాన్స్ ఉంది.
సుకుమార్ః క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ తనదైన టేకింగ్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఆడియన్స్ లో మంచి ఫాలోయింగే ఉంది. రంగస్థలం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం వంద కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు. అంటే.. రెండు సినిమాలు అనుకోవాల్సిందే. ఈ చిత్రానికి గానూ 30 కోట్ల మేర తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
కొరటాల శివః హీరోల్లో మినిమం గ్యారంటీ వాళ్లు ఉన్నట్టుగానే.. దర్శకుల్లో గ్యారంటీ ట్యాగ్ అందుకున్నాడు కొరటాల శివ. ఇప్పటి వరకు చేసిన నాలుగు సినిమాలూ సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో.. ఈయన రెమ్యునరేషన్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఆచార్యకు రూ.13 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.
వీరితోపాటు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నవారంతా పది కోట్ల మేర పారితోషికాలు తీసుకుంటున్నారు. వీరిలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, శేఖర్ కమ్ముల తదితరులు ఉన్నాయి. మొత్తానికి.. తెలుగు ఇండస్ట్రీలో దర్శకులకు ఇన్నాళ్లకు మంచి టైమ్ వచ్చింది. దీంతో.. వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తోందని అంటున్నారు.