Savitri Birth Anniversary: తెలుగు వెండితెర పై నిండు వెలుగు రేఖలా మెరిసిన తిరుగులేని కళాభినేత్రి ఆమె, మరవలేని మహానటి ‘ఆమె’, ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మొదటి తరం కథానాయక ఆమె. కనుసైగతో కోటి కళలు పండించగల మహా నటీమణి ఆమె, సినీ జగతిలో ఆవిడ ప్రయాణం, మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినీ ప్రపంచానికి ఒకే ఒక మహానటి.. ఆమె ‘కొమ్మారెడ్డి సావిత్రి’.
దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలను కురిపించి, అభినయంలో తనకు సాటి మరొకరు లేరని, అశేష ప్రజల హృదయాల్లో అభినేత్రి గా నిలిచిపోయిన ఒక్కే ఒక్క మహానటి సావిత్రి. నటనలోనే కాదు, దానాల్లోనూ మేటి ఆమె, ఆదరణ లోనే కాదు, విద్యాదానంలోనూ ఆమెకు సాటి లేరు ఏ ఘనాపాటి. సావిత్రి 1937 డిశంబర్ 6న జన్మించారు.
12 ఏటనే సంసారం సినిమాతో మొదటి సారి తెరపై కన్పించి మెప్పించారు. 1949లో అగ్ని పరీక్షలో అవకాశం వచ్చినా అప్పటికి ఆమె చిన్న పిల్ల అని, మెచ్యూరిటీ లేక ఆ పాత్రకి సరిపోదని ఆ సినిమాలో ఆమెను ఎంపిక చేయకపోయినా.. ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ అవకాశం వచ్చింది. పాతాళభైరవి చిత్రంలో నృత్యపాత్ర చేసే అవకాశం అది. అలా చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైంది సావిత్రి సినీ ప్రస్థానం.
కానీ ‘ఆమె నటన’ చిన్న పాత్రలనే పెద్ద పాత్రలను చేసింది. ముఖ్యంగా పెళ్లి చేసి చూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. అయితే, సావిత్రిలోని అసామాన్య నటిని తెలుగు తెరకు పరిచయం చేసిన సినిమా మాత్రం దేవదాసు సినిమానే. అపురూపమైన ఆ దృశ్యకావ్యంలో పార్వతిగా సావిత్రి నటన అజరామరంగా నిలిచిపోయింది. మనసును వెంటాడే పార్వతి పాత్రలో సావిత్రి నటన అపూర్వం… అద్బుతం.
అమాయకమైన ప్రేయసిగా సావిత్రి అభినయం, నటనా కౌశలం వర్ణించాలంటే ఏ పదాలు సరిపోవు. అంత అత్యద్భుతంగా సావిత్రి జీవించింది కాబట్టే.. ఎప్పటికీ ఆమె మహానటినే. ఆ మహానటి గురించి కొన్ని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం.
చిన్న చిన్న పాత్రలతో మొదలైన సావిత్రిగారి సినీ ప్రయాణం ఆ తర్వాత వరుసగా ఇవి సావిత్రి మాత్రమే చేయగలదు అనే పాత్రలు ఎన్నో చేశారు సావిత్రి గారు. మిస్సమ్మ, మధురవాణి, శశిరేఖ ఇలా తన నటనతో ఆమె జీవం పోసిన పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఆ పాత్రలన్నీ ఎప్పటికీ జీవించే ఉంటాయి. ముఖ్యంగా తెలుగు చలన చిత్ర చరిత్ర గురించి ప్రస్తావిస్తే అందులో ‘మాయబజార్’ గురించి చెప్పకుండా వుండలేం అంటే.. దానికి కారణం సావిత్రి అభినయమే.
అలాంటి అద్బుతమైన చిత్రంలో కథ మొత్తం సావిత్రి పాత్ర చుట్టే తిరుగుతుంది అంటేనే.. హీరోలకి ఆమె ఎంతగా పోటీ ఇచ్చిందో ఉహించొచ్చు. ఆ సినిమాలో పెళ్లి సన్నివేశంలో శశిరేఖగా వచ్చిన ఘటోత్కచుని చూపించే సమయంలో ఒకేసారి తనలోని లావణ్యంతో పాటు ఎస్వీఆర్ లాంటి నటుని గాంభీర్యాన్ని కూడా తన ఆహార్యంలో పలికించి వహ్వా అనిపించగలిగిన నటి కాబట్టే.. సావిత్రి మహానటి అయ్యారు.
మొదట ఆ పాత్రను సావిత్రి చేయలేదేమో అని ముందు అభిప్రాయపడ్డారట నాగిరెడ్డి. కానీ అప్పటికి సావిత్రినే గొప్పనటి. ఇక ఆమెనే ఆ పాత్ర కోసం తీసుకున్నారు. కానీ ఆ సినిమాలో ఆమె నటనకు నాగిరెడ్డి, ఆమె అభిమానిగా మారిపోయారట.
Also Read: RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” చిత్రం నుంచి రామ్ చరణ్ పోస్టర్ రిలీజ్… అదరగొట్టిన చరణ్
అన్నట్టు 1968లో చిన్నారిపాపలు అనే సినిమాకు సావిత్రి దర్శకత్వం వహించారు. దక్షణ భారత దేశంలోనే తొలిసారిగా మహిళలచే నిర్మించబడిన చిత్రంగా గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ లో ఈ మూవీ స్థానం దక్కించుకుంది అంటే.. ఆ ఘనత మహానటి సావిత్రిదే.
సావిత్రి కుగ్రామమైన వడ్డివారిపాలెంలో పుట్టారు. అందుకే, ఆ గ్రామంలోని పేద విద్యార్థులకు విద్యను అందించాలని 1962 సంవత్సరంలో పాఠశాల స్థాపించారు. ఆ స్కూల్ పేరు శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఆ పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది.
Also Read: Box Office: ఈ వారం ఏకంగా 8 సినిమాలు !