Tollywood Hit Formula: ఇది కథల కాలం. కథ బాగుందా ? ఇక అంతే, ఆ సినిమా సూపర్ హిట్టే. స్టార్ లను బట్టి సినిమాలు ఆడే రోజులు పోయాయి. గతంలో స్టార్ హీరోల సినిమాలకు టాక్ తో పనిలేకుండా భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. దాంతో, కలెక్షన్స్ కూడా భారీగా వచ్చేవి. అందుకే.. స్టార్ల కోసం మేకర్స్ ఎగబడేవారు. కానీ.. ప్రస్తుతం అలా లేదు. పెద్ద హీరోల సినిమాలకు కూడా టాక్ బాగుంటేనే.. ఓపెనింగ్స్ వస్తున్నాయి. రానున్న యుగమంతా కథా,కథనం, సాంకేతిక నిపుణులుదే అని అర్థం అయిపోయింది. ఈ మధ్యకాలంలో మంచి కంటెంట్ తో వచ్చిన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కంటెంట్ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు సినిమాకి వస్తారని, లేకపోతే రెండో రోజే సినిమా పోతుందని ఈ చిత్రాలు రుజువు చేశాయి.

నిజానికి పై మూడు చిత్రాల్లోని హీరోలకు తెలుగులో ప్రత్యేక స్టార్ డమ్ ఏమీ లేదు. పైగా వీరి కోసం అంటూ సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏమీ లేదు. అయినా.. వీరి సినిమాలకు ప్రేక్షకులు ఎగబడ్డారు. అందుకే, ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కథల మీద దృష్టి పెట్టాలని, ఒక సినిమా ఎందుకు హిట్ అయింది ?, ఎందుకు ఫ్లాప్ అయింది ? అని ఆలోచించుకోవాలి అని.. డైరెక్టరే సినిమాకి కెప్టెన్ అని, అతను హిట్ మత్తులో పడి చిత్తూ కాకూడదు అని మెగాస్టార్ చిరంజీవి లాంటి వారే డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. చిరంజీవి లాంటి స్టారే.. కథ మాత్రమే సినిమాని హిట్ చేస్తోంది అని చెబుతున్నారంటే.. ఇప్పటి సినిమా హిట్ ఫార్ములా ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కథకు ఇది మంచి కాలం. మంచి కథతో సినిమా చేస్తే.. ఊరు పేరు లేని హీరో కూడా భారీ కలెక్షన్స్ ను రాబడుతున్నాడు. అందుకే, ఇకనైనా ఒక సినిమా స్క్రిప్ట్ రాసేటపుడు ప్రతి దర్శకుడు ప్రేక్షకుడిలా ఆలోచించాలి. అయినా, ఇంత డబ్బు పెట్టి ప్రేక్షకుడు సినిమాని ఎందుకు చూడాల్లి ?, ఈ డిజిటల్ యుగంలో సమయం చాలా విలువైనది. ప్రతి మనిషికి ఈ విషయం అర్ధం అవుతుంది. అందుకే, డబ్బు పోయినా పర్వాలేదు. సమయాన్ని మాత్రం వృధా చేసుకోవడానికి మాస్ ప్రేక్షకులు కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు ప్రతి సెకన్ కు న్యాయం జరగాలని ఆశిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వస్తున్న సినిమాలు ఎంత అద్బుతంగా ఉండాలి.

కాబట్టి, డైరెక్టర్లు కథ, కంటెంట్ పై దృష్టి సారిస్తేనే హిట్స్ వస్తాయి. హీరోలు కూడా కళ్లు తెరిచి తమ స్టార్ డం ని కాకుండా కథని నమ్ముకుని సినిమాలు చేయాలి. నిర్మాతలు కూడా స్టార్లని పక్కన పెట్టి కథాశ్రవణానికే ప్రాధాన్యత ఇవ్వాలి. కథకులనే స్టార్స్ ని చెయ్యాలి. అప్పుడే తెలుగు సినిమానే కాదు, యావత్తు భారతీయ సినిమా కూడా మరో స్థాయికి వెళ్తుంది. ఒకవేళ కాంబినేషన్‌ని బట్టి సినిమా అనుకున్నా.. కచ్చితంగా గొప్ప కథ ఉండాల్సిందే. కథ ఉంటేనే ఏదైనా వర్కవుట్ అవుతుంది అనే కనీస జ్ణానాన్ని నిర్మాతలు అర్థం చేసుకోవాలి.
కథ బాగా రావాలి అంటే.. ముందు ప్రొడ్యూసర్ కూడా ఆ కథలో ఇన్వాల్వ్ అవ్వాలి. దీనివల్ల బడ్జెట్ పై కూడా బాగా క్లారిటీ ఉంటుంది. కానీ మంచి కథ అని ఎలా నమ్మాలి ?, అసలు ఏది మంచి కథ ?, ఎలా తెలుస్తోంది ?, ఇది పదునైన కత్తిమీద సాము లాంటిదే. కానీ, మంచి కథకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ కథలో ప్రధాన క్యారెక్టర్ లో గొప్ప ఎమోషనల్ డెప్త్ ఉండాలి. అలాగే, ఆ డెప్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అన్నిటికీ మించి ఆ కథ గానీ, ఆ పాత్ర గానీ ప్రేక్షకులు బాగా ఎంటర్ టైన్ గా ఫీల్ అవ్వాలి. అప్పుడే, అది మంచి కథ నమ్మొచ్చు. మరి దర్శక నిర్మాతలు మంచి కథల కోసం మరెన్నో కసరత్తులు చేసి ముందుకు వెళ్లాలని ఆశిద్దాం. మరెందరో తెలుగు మేకర్స్ గొప్ప హిట్ సినిమాలు తీయాలని కోరుకుందాం.
[…] […]