Pseudobulbar Affect: మనం చాలామందిని చూసి అరే వీళ్లకు ఎలాంటి సమస్యలు లేవు. హ్యాపీగా, ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తాం. కానీ కొంతమందికి ఉండే సమస్యలు బయటకు కనిపించవు. ఒకవేళ కనిపించిన అవి మనకు చిన్న సమస్యలుగానే ఉంటాయి. ఎప్పుడూ వినని డిసీజ్‌లు ఈరోజుల్లో కొంతమందికి వస్తున్నాయి. అందులో ఒకటి నవ్వు ఆపుకోకపోవడం. ఈమధ్య కాలంలో కొందరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ డిసీజ్ బారిన పడిన వారిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా ఉన్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? డిజార్డర్ ఏంటి? ఎందుకు వస్తుంది? దీనిని తగ్గించుకోవడం ఎలాగో తెలుసుకోవాలంటే స్టోరీ చదివేయండి.
కేవలం నవ్వడం మాత్రమే కాదు
కొంతమంది నవ్వును ఆపుకోలేరు. ఒకసారి నవ్వడం స్టార్ట్ చేస్తే.. ఆపకుండా దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు నవ్వుతుంటారు. సడెన్‌గా వచ్చే నవ్వును ఆపుకోలేకపోతే వాళ్లను నవ్వే వ్యాధి ఉందని అర్థం. దీన్ని సూడోబుల్బార్ డిసీజ్ అంటారు. అయితే కొందరు ఏడుపును కూడా ఆపుకోలేరు. ఈ వ్యాధి వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టి కూడా ఉన్నారు. ఆమెకు లాఫింగ్ డిసీజ్ ఉన్నట్లు ఆమెనే స్వయంగా తెలిపారు. నవ్వడం ప్రారంభిస్తే అలా 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటారు. ఏదైనా కామెడీ సీన్ జరిగినా, సినిమాలు చూసినప్పుడు ఒక్కసారిగ నవ్వితే ఆపకుండా నవ్వుతారట. దీనివల్ల షూటింగ్‌లో చాలాసార్లు ఇబ్బంది జరిగినట్లు కూడా తెలిపారు.
ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది?
బ్రెయిన్ స్ట్రోక్, కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినడం, మెదడుకు గాయాలు కావడం, అల్జీమర్స్ వంటి సమస్యల వల్ల ఈ సూడోబుల్బార్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణలు చెబుతున్నారు. దీనివల్ల వాళ్ల ఎమోషన్స్, సంతోషం, బాధ, ఏడుపు అన్ని కొంతసేపు అలానే ఉండిపోతాయి. అయితే దీని లక్షణాలు కొంతమందిలో వేర్వేరుగా ఉంటాయి. కొందరిలో నవ్వాలసిన టైమ్‌లో ఏడవడం, బాధ రావలసిన సమయంలో నవ్వు రావడం వంటివి జరుగుతాయి. వీటవల్ల సంబంధాలు దెబ్బతింటాయి. దీని ఫలితంగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా వస్తాయి. వీటి నుంచి విముక్తి పొందాలంటే యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి.
నయం చేయడం ఎలా?
సూడోబుల్బార్ డిసీజ్‌ను పూర్తిగా నయం చేయలేరు. కానీ కొన్ని మందుల ద్వారా అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. సడెన్‌గా నవ్వు వచ్చిన, ఏడుపు వచ్చిన నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. మానసికంగా సంతోషంగా ఉండటానికి ట్రై చేయాలి. చుట్టూ ఉండే మనుషులు మిమ్మల్ని కించపరిచేలా కాకుండా సమస్యను అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఆపుకోలేని నవ్వు వచ్చినప్పుడు మీకు నచ్చిన విషయాలపై దృష్టి పెడితే కొంతవరకు తగ్గించుకోవచ్చు. అప్పుడే ఈ సమస్యలను కొంతవరకు అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.