రెండు నెలలకు పైగా లాక్ డౌన్ తో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆగిపోయింది. కుదేలైంది. ఇప్పుడు లాక్ డౌన్ మెల్లిమెల్లిగా సడలిస్తున్నా కూడా సినీ పరిశ్రమను తెరిచేరోజుపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే సామూహికంగా జనాలు గుమిగూడే థియేటర్స్ , మాల్స్, సినిమా షూటింగ్ లకు ప్రభుత్వం ఇప్పట్లో అనుమతులు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టిప్లెక్సెస్ మూతపడ్డాయి. దీంతో ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేక జీవనం కష్టంగా మారింది. అయితే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం ఈ మధ్య కొన్ని రంగాలకు కాస్త మినహాయింపులు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పలు రంగాలకు అటు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరికొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.
*సినీ పరిశ్రమకు జగన్ గుడ్ న్యూస్
కరోనా లాక్ డౌన్ తో అన్నింటికంటే ఎక్కువగా దెబ్బపడింది సినిమా రంగంపైనే.. సినిమాలు ఆగిపోయాయి.. సీరియళ్లు నిలిచిపోయాయి. షూటింగ్ లు అన్నీ బంద్ అయిపోయాయి. సామూహికంగా చూసే థియేటర్స్ మూతపడ్డాయి. ఇప్పుడు దేశమంతా ఓపెన్ అయిన వేళ సినిమాలు, సీరియళ్లు, వాటి షూటింగులకు మాత్రం పలు రాష్ట్రాలు అనుమతులు ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ పరిశ్రమ అంతా నెలవై ఉన్న తెలంగాణలో వాటికి అనుమతి లేదు. అయితే ఏపీ సీఎం జగన్ ఈ విషయంలో ఎంతో పెద్ద ఉదార నిర్ణయం తీసుకొని సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్ చెప్పారు.
*గడ్డు స్థితిలో సినీ కళాకారులు, కార్మికులు
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. థియేటర్స్ ఓపెన్ అవుతాయని.. షూటింగ్స్ మళ్లీ మొదలుపెట్టుకోవచ్చని టాలీవుడ్ సినీ పరిశ్రమ గంపెడాశలు పెట్టుకుంది. కానీ ఎంటర్టైన్మెంట్ లో ముఖ్యపాత్ర పోషిస్తున్న సినిమాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గని నేపథ్యంలో థియేటర్లు తెరిస్తే సమస్య తీవ్రమవుతుందని.. ప్రజలు కూడా థియేటర్లకు వచ్చే ఆలోచన చేస్తారని అనుకోవటం లేదని.. అందుకే కనీసం మరో మూడు నాలుగు నెలల పాటు థియేటర్లు తెరిచే ఉద్దేశం లేదని ఖరాఖండీగా తేల్చేశారు. దీంతో పరిస్థితులు చక్కబడితే షూటింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చన్న వారు షాక్ కి గురయ్యారు.
*ఏపీలో షూటింగ్ లకు జగన్ పచ్చజెండా
ఇదిలా ఉండగా ఇప్పుడు లేటెస్టుగా ఏపీలో సినిమా షూటింగ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసిందని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమాల షూటింగ్ లతో పాటు సీరియల్ షూటింగ్స్ కూడా చేసుకోవచ్చునని ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొందట. దీంతో ఆగిపోయిన సినిమాలు, సీరియళ్ల షూటింగ్ లు మొదలు పెట్టే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే టీవీ చానెల్స్ లో పాత ప్రోగ్రామ్స్ చూడలేక ఖాళీగా ఉంటున్న జనం చస్తున్నారు. దీంతో ఇవి షూటింగ్ లు మొదలైతే టీవీలకు కళ వస్తుంది. అందుకే రిస్క్ అయిన కూడా ఏపీలో షూటింగ్ లకు వెళ్లాలని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న సినీ పరిశ్రమకు ఏపీ సీఎం జగన్ నిర్ణయం కాస్త ఊరట లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక ఏపీలో షూటింగ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేయడం నిజమైతే తెలంగాణాలో సినిమా మరియు సీరియల్స్ షూటింగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుటుందనేది ఆసక్తిగా మారింది.
*ఏపీకి సినీ ఇండస్ట్రీ తరలిపోతుందా?
సినిమా ఇండస్ట్రీపై బతుకుతున్న ఎంతో మంది నటులు, కార్మికులకు సీఎం జగన్ దారి చూపించారని.. ఈ నిర్ణయం సినీ పరిశ్రమ ను నిలబెడుతుందని టాలీవుడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో అనుమతి ఇవ్వకపోవడంతో తెలుగు సినిమా పరిశ్రమ, టీవీ ఇండస్ట్రీ ఏపీకి తరలిపోవడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. అక్కడే షూటింగ్ లు జరుపుకోవడానికి సిద్ధమైంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో క్రమంగా షూటింగ్ లకు ఏపీ స్వర్గధామమై.. తెలంగాణకు ఇది పెద్ద మైనస్ గా మారే చాన్స్ ఉందంటున్నారు.
-నరేశ్ ఎన్నం