‘తెలుగు కమర్షియల్ సినిమా’లో హీరోయిన్ అనగానే ‘గ్లామర్ డాల్’ అనే మాట మాత్రమే వినిపించేది ఒకప్పుడు. కానీ, కాలం మారుతుంది. అందం బదులు అభినయం వైపు ప్రేక్షకుల మనసు మళ్లుతుంది. ఇప్పుడు కథానాయికలు అందంగానే ఉండాల్సిన పనిలేదు, కుందనపు బొమ్మల్లాగే కనబడాల్సిన పని అంతకంటే లేదు. పైగా శరీరాకృతిలోనూ అందాలు ఎలివేట్ అయ్యేలా ప్రత్యేకమైన ట్రిక్స్ కూడా ఇక మెయింటైన్ చెయ్యక్కర్లేదు.
ఎందుకంటే, ఇప్పుడు తెలుగు సినిమా ఇష్ట పడుతుంది ప్రయోగాలు చేసే కథానాయికలను మాత్రమే. అందుకే అందం కంటే అభినయమే ముఖ్యమనుకునే హీరోయిన్లు కూడా రోజురోజుకు పెరుగుతున్నారు. పైగా వారికే డిమాండ్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో మొన్నటివరకు ఎక్స్ పోజింగ్ తో గ్లామర్ తో ఒక ఊపు ఊపిన భామలు కూడా రూట్ మార్చారు. తమలోని బ్యూటీని పక్కనపెట్టి.. సహజమైన పాత్రలలో ఒదిగి పోవడానికి సిద్ధపడుతున్నారు.
కథలోని తమ పాత్రకు ప్రాధ్యానత ఉంటేనే ఆ సినిమా చేస్తున్నారు. అది డీగ్లామరైజ్డ్ పాత్ర అయినా దానిలో జీవించడానికి కఠినమైన కసరత్తులు చేస్తున్నారు. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజీ పాత్ర కోసం నల్లగా కనిపించడానికి సమంత చాల ప్రయోగాలే చేసింది. శరీర రంగును తగ్గించుకోవడానికి బాగానే కష్టపడింది. గ్లామర్ భామగా భారీ డిమాండ్ ఉన్న సమయంలోనే, అనుష్క పుల్లలు ఏరుకునే బందీగా అందవిహీనురాలి పాత్రతో మైమరిపించింది. ఇదే ‘బాహుబలి’లో తమన్నా సైతం కొన్ని సీన్స్ లో డీ గ్లామర్ గా కనిపించి షాక్ ఇచ్చింది.
ఇక ‘ఆర్‌ఎక్స్ 100’తో హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన పాయల్ రాజ్‌పుత్ కూడా ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాలో తన ఇమేజ్ కి పూర్తి భిన్నంగా కనిపించి తనలో నటి కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది. ‘ఓదెల రైల్వేస్టేషన్’లో హెబ్బా పటేల్ కూడా నల్లపిల్లగా కనిపించబోతుంది. జయశంకర్ డైరెక్షన్ లో వస్తోన్న సినిమాలోనూ కాజల్ డీ గ్లామర్ లుక్ లో ఎత్తుపళ్లు అమ్మాయిగా కనిపించనుంది.
ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మికా మందన్న కూడా గిరిజన యువతిగా మేకప్ లేకుండా నటిస్తోంది. ‘గమనం’ అనే సినిమాలో శ్రీయా కూడా మేకప్ లేకుండానే నటించింది. మొత్తానికి అందానికి కథానాయికల నిర్వచనం మారిపోయింది. దీనికితోడు బాహ్య సౌందర్యం కంటే పాత్రలోని సౌందర్యానికే మేకర్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సహజమైన పాత్రల్లో సహజంగా నటిస్తేనే ఆ నటి నటన రెట్టింపు అవుతుంది. మహానటి సావిత్రి కాలంలో అప్పటి నటీమణులు అలాగే నటించేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ పాతతరంలోకి తొంగి చూస్తోంది నేటి కథానాయక తరం.