OTT Movie : ప్రస్తుతం డబ్బు ఉన్నవారికే సమాజంలో గౌరవం లభిస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. నైతిక విలువలు తగ్గిపోతున్న ఈ కాలంలో ఓ సాధారణ వ్యక్తి కోటిన్నర లాటరీ గెలిచినప్పటికీ దానిని తాను సొంతం చేసుకోకుండా అసలైన యజమానికి అప్పగించడానికి తపించడంతో కథ నడిచే సినిమా ‘తిరు మాణిక్కం’ (Thiru Manickam). మంచి కథతో, విలువలతో తెరకెక్కించిన ఈ తమిళ చిత్రం ప్రస్తుతం జీ 5 (Zee 5) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమాను నంద పెరియసామి తెరకెక్కించారు. ఇందులో సముద్రఖని, అనన్య, భారతీరాజా, నాసర్, తంబి రామయ్య, కరుణాకరన్, ఇళవరసు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక కథ విషయానికి వస్తే.. మాణిక్కం (సముద్రఖని) ఓ సాధారణ వ్యక్తి. అతను లాటరీ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తాడు. అతని కుటుంబంలో భార్య, ఇద్దరు కుమార్తెలు ఉంటారు. చిన్న కుమార్తె మాటలు రావు. డాక్టర్లు మాటలు మాట్లాడించడానికి ప్రయత్నించాలని సూచిస్తారు. అయితే, మరోపక్క ఇన్స్పెక్టర్ దగ్గర అప్పుగా తీసుకున్న రెండు లక్షలు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కూడా మాణిక్కంపై ఉంటుంది.
ఒకరోజు ఒక వృద్ధుడు మాణిక్కం షాప్‌కి వచ్చి నాలుగు లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తాడు. అయితే, డబ్బులు ఇవ్వకముందే ఓ సమస్యతో వెళ్లిపోతాడు. మరుసటి రోజు తీసుకువస్తానని చెబుతాడు. కానీ అదే రోజు ఆ టికెట్లలో ఒకటి కోటిన్నర రూపాయలు గెలుస్తుంది.
నిజాయితీని వదలని మాణిక్కం
ఈ విషయం తెలిసిన మాణిక్కం వెంటనే ఆ వృద్ధుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. కానీ, అతని భార్య ఈ విషయాన్ని తెలుసుకుని “డబ్బు ఇంకా చెల్లించలేదు కాబట్టి, అది మనదే!” అని చెప్పి ఆపేందుకు ప్రయత్నిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మాణిక్కాన్ని అడ్డుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ అతడు తన నిజాయితీని వదలకుండా, లాటరీ టికెట్ నిజమైన యజమానికే అందించాలనే గట్టి పట్టుదలతో ఉంటాడు. అయితే మాణిక్కం పెద్దాయనని కలుస్తాడా. చివరికి మాణిక్యం లాటరీ టికెట్టు ఆ పెద్దాయనకి ఇస్తాడా? ఆ టికెట్ వల్ల మాణిక్యం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి.. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘తిరు మాణిక్కం’ (Thiru Manickam) అనే ఈ మూవీని చూడాల్సిందే.
“మనసుకు హత్తుకునే మంచి కథ, గొప్ప సందేశం” ఉన్న చిత్రం ‘తిరు మాణిక్కం’. మీరు మంచి కథతో కూడిన సినిమాలను ఇష్టపడితే Zee 5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను తప్పకుండా చూడండి.