Krishnam Raju Passes Away: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు అకాల మరణం అందరిని కలచివేసింది. దీంతో పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ, సినీ ప్రముఖుల ఆయన మరణంపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ మరో ఆణిమత్యాన్ని తీసుకుపోయిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి పలు చిత్రాలు నిర్మించారు. రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేశారు. బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికై వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. కృష్ణం రాజు రెబల్ స్టార్ గా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

కృష్ణంరాజు మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. రెబల్ స్టార్ గా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారని కేసీఆర్ కొనియాడారు. కృష్ణంరాజు రాజకీయాల్లో ఎంతో నిజాయితీతో పనిచేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటని చెప్పారు. కృష్ణం రాజు మరణం తెలుగు ప్రేక్షకులకు దుఖాన్ని మిగిల్చిందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రెబల్ స్టార్ మరణం సినీ పరిశ్రమకు రాజకీయాలకు ఎంతో చేటు అని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మరణంపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కృష్ణం రాజు లేరని వార్త చేదుగా అనిపిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కృష్ణం రాజు మృతికి చింతిస్తున్నామని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు కృష్ణం రాజు మరణం తీరని లోటని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన అనేకమంది అభిమానాన్ని చూరగొని రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కృష్ణం రాజుతో తనకు ఎంతో అనుబంధం ఉందని సూపర్ స్టార్ కృష్ణ పేర్కొన్నారు. మనల్ని విడిచిపెట్టి వెళ్లడం బాధాకరంగా ఉందని శోకాతప్త హృదయంతో చెప్పారు. కృష్ణం రాజు లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మనవూరి పాండవులు చిత్రం నుంచి తనను పెద్దన్నయ్యలా ప్రోత్సహించే వారని దుఖించారు.

కృష్ణంరాజు లేని లోటు తీర్చలేనిదని బాలకృష్ణ అన్నారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నేతగా, కేంద్ర సహాయ మంత్రిగా ఎన్నో పాత్రలు పోషించిన ఆయన మన ముందు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కృష్ణంరాజు తనకు సోదరసమానుడని మోహన్ బాబు అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేశారు. కృష్ణం రాజు మరణం తనను తీవ్రంగా కలచివేసిందని మహేశ్ బాబు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణం రాజు గారి లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని సినీనటి అనుష్క అన్నారు. ఆయన ఎప్పటికి మన హృదయాల్లో నిలిచే ఉంటారని గుర్తు చేశారు.
కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలచివేసిందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కృష్ణం రాజు మృతి బాధాకరమని పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ, బీజేపీ ఓ దిగ్గజ నేతను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.