
Allu Arjun : అల్లు అర్జున్ బర్త్ డే పురస్కరించుకుని విడుదల చేసిన టీజర్ అద్భుతంగా ఉంది. ‘పుష్ప ఎక్కడ?’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఆ టీజర్ కట్ చేశారు. మూడు నిమిషాలకు పైగా ఉన్న టీజర్ ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంది. పుష్ప ఏమయ్యాడనే సస్పెన్సు తో మొదలైన టీజర్ హీరో గూస్ బంప్స్ ఎంట్రీతో ముగించారు. చిన్న టీజర్లోనే హైప్ ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉన్నాయి. టీజర్ కి మించి ఫస్ట్ లుక్ ఆసక్తి రేపింది. ఉగ్రరూపం దాల్చిన అమ్మవారిగా అల్లు అర్జున్ చేతిలో గన్ పట్టుకొని ఉన్నాడు.
అధికారిక విడుదలకు ముందే అల్లు అర్జున్ లుక్ లీకైంది. ఫస్ట్ ఇది ఫ్యాన్ మేడ్ అని పలువురు భావించడం విశేషం. కాగా ఈ గెటప్ లో అల్లు అర్జున్ ఓ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటాడట. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఈ యాక్షన్ సన్నివేశం సినిమాకే హైలెట్ కానుందంటున్నారు. గంగమ్మ జాతర కోసం అల్లు అర్జున్ అమ్మవారి అవతారం ధరిస్తాడట. దర్శకుడు సుకుమార్ ఆ జాతరలో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్లాన్ చేశారట.
అల్లు అర్జున్ ఈ గెటప్ వేయడం కథలో భాగమేనట. అలాగే అలా అమ్మోరి గెటప్ వేయడం స్థానికంగా ఆచారంగా ఉందట. దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉందట. పూర్వం తిరుపతి ప్రాంతాన్ని పాలెగోండు లేదా పాలెగాళ్ళు అని పిలవబడే వంశస్థులు పాలించేవారట. వారి వారసుల్లో ఒకడైన పాలెగాడు ఆడవాళ్లను చెరబడుతూ ఉండేవాడట. తనకు నచ్చిన యువతులను, పెళ్ళైన మహిళలను లైంగికంగా వాడుకుంటూ ఉండేవాడట.

ఆ పాలెగాడిని అంతమొందించేందుకు గంగమ్మ తల్లి తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామంలో కైకాల కులంలో జన్మిస్తుందట. గంగమ్మ పెరిగి పెద్దదై యుక్తవయసుకు రాగానే పాలెగాడి కన్నుబడుతుందట. ఇతర అమ్మాయిల మాదిరి గంగమ్మను పాలెగాడు లైంగికంగా వాడుకునే ప్రయత్నం చేస్తాడట. అతన్ని గంగమ్మ సంహరించబోతుందట. గంగమ్మకు భయపడిన పాలెగాడు అడవిలోకి పారిపోతాడట. అతన్ని బయటకు రప్పించేందుకు జాతర నిర్వహిస్తారట. ఆ జాతరలో పాలెగాడిని అమ్మవారు సంహరిస్తుందట. అప్పటి నుండి గంగమ్మ జాతర ప్రతి ఏడాది నిర్వహిస్తారట. ఈ జాతరలో మగాళ్లు మొక్కుగా అమ్మవారి వేషధారణ వేస్తారట. పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ గెటప్ కి స్థానిక పురాణమే స్ఫూర్తి అంటున్నారు. ఈ మేరకు ఓ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.
దర్శకుడు సుకుమార్ సినిమాలో కీలకమైన ఓ విలన్ ని చంపేందుకు ఈ సెటప్ అండ్ గెటప్ ప్లాన్ చేశాడట. ఒకప్పటి పాలెగాడి షేడ్స్ ఉన్న విలన్ ని చంపేందుకు హీరో అల్లు అర్జున్ గంగమ్మ జాతరను వేదిక చేసుకుంటాడట. తనను గుర్తు పట్టకుండా ఉండేదుకు ఆ జాతరకు మగాళ్లు మొక్కుబడిగా ధరించే అమ్మోరు వేషధారణలోకి మారతాడట. అల్లు అర్జున్ ఈ గెటప్ ధరించడం వెనుక అసలు కారణం ఇదే అంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ సీక్వెన్స్ ని సుకుమార్ ప్రత్యేకంగా రూపొందించారంటున్నారు.