Tamanna Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా సడన్ షాక్ ఇచ్చారు. ఆమె తన భర్తను పరిచయం చేశారు. ఈయనే మాఆయన అంటూ ఝలక్ ఇచ్చారు. అసలు పెళ్లి కాకుండా ఈ భర్త ఎక్కడ నుండి వచ్చాడని మీకు సందేహం కలగవచ్చు. అసలు విషయం ఇక్కడే ఉంది. నిజంగా తమన్నాకు వివాహం కాలేదు. ఇటీవల తనపై వచ్చిన పుకార్లకు తనదైన శైలిలో సెటైర్ వేసింది. కొద్దిరోజులుగా తమన్నా వివాహం చేసుకోబోతున్నారనే వార్త హాట్ టాపిక్ అయ్యింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్తతో తమన్నా పెళ్లి సిద్దమయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం చేసుకోవడానికి తమన్నా ఆసక్తిగా ఉన్నారనేది సదరు వార్తల సారాంశం.

ఈ పుకార్లకు ఒక్క పోస్ట్ తో తమన్నా సమాధానం చెప్పింది. ఎఫ్ 3 మూవీలో తాను మేల్ గెటప్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో షేర్ చేసి… ఈయనే నా బిజినెస్ హస్బెండ్ అంటూ కామెంట్ చేసింది. తమన్నా ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. దీంతో ఈసారి కూడా తమన్నా పెళ్లి వార్త పుకారే అని తేల్చేసింది. గత రెండేళ్లుగా తమన్నా పెళ్లిపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఆమెకు 32 ఏళ్ల వయసు రావడంతో పాటు కెరీర్ కూడా నెమ్మదించింది. దీంతో పెళ్లి చేసుకుంటారనే వార్తలు తరచుగా చక్కర్లు కొడుతున్నాయి.
అయితే పెళ్లికి ఇంకా సమయం ఉంది అంటుంది తమన్నా. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతానని పలు సందర్భాల్లో వెల్లడించారు. తమన్నా ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో భోళా శంకర్ అతిపెద్ద ప్రాజెక్ట్. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ అని సమాచారం. ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేయడం మరో విశేషం.

అలాగే సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం టైటిల్ తో మరో మూవీ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గుర్తుందా శీతాకాలం విడుదలకు నోచుకోవడం లేదు. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఒకటి రెండు హిందీ చిత్రాల్లో తమన్నా నటిస్తున్నారు. టాలీవుడ్ లో సుదీర్ఘ కెరీర్ అనుభవించిన హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. పదిహేనేళ్లుగా తమన్నా బిజీ స్టార్ గా కొనసాగుతున్నారు. తమన్నాతో పాటు పరిశ్రమకు వచ్చిన కాజల్ పెళ్లి చేసుకొని ఒక అబ్బాయిని కూడా కన్నారు.