Baby movie 2023 : ‘ఎంత సేపు పొద్దున్న లేస్తే మహిళా అభ్యుదయం.. మహిళా పక్షపాతం, మహిళా శ్రేయస్సుయేనారా బై.. కాసింత మగాళ్ల మనసు కూడా తరిచి చూడండని’ భగ్న ప్రేమికులు నిజంగానే ప్రాధేయపడుతున్నారు. ఎందుకంటే ప్రేమలో విఫలమైన ఒక భగ్న ప్రేమికుడి బాధ నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఆ బాధ మరో మగాడికే తెలుస్తుంది. అదీ లవ్ ఫెయిల్యూర్ వాళ్లకే తెలుస్తుంది.
చరిత్రలో కొద్ది సేపు తవ్వకాలు జరుపుదాం.. ఆది నుంచి మగాళ్లను వదిలేసి వేరే పెళ్లిళ్లు చేసుకున్న వారినే చూపించారు. సమాజంలో డబ్బున్న వాళ్లనే యువతులు ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం అత్యంత సహజంగా జరుగుతోంది. దాన్ని మనం తప్పుపట్టలేం. తప్పుపట్టాల్సింది.. ఆ యువతులను నమ్మి నిండా ప్రేమించే మగాళ్లనే. పోనీ ప్రేమించారు పో.. నాడు దేవదాసు, లైలా మజ్ను సహా ఎంతో మందిని అమ్మాయిలు ప్రేమించి వదిలేస్తే మగాళ్లు మందు తాగుతూ గడ్డాలు,మీసాలు పెంచేసి అర్జున్ రెడ్డిలు అయిపోయారు. ఇప్పటికీ అవుతున్నారు కూడా.. ‘ప్రేమిస్తే’ సినిమాలో ప్రియుడితో పెళ్లికాక తల్లిదండ్రుల బలవంతం మీదే వేరే పెళ్లి చేసుకుంటే ఆ ప్రియుడు పిచ్చోడిగా మారి వీధుల్లో తిరుగుతాడు. అర్జున్ రెడ్డిది అదే బాధ..
అంతదాకా ఎందుకు.. తాజాగా విడుదలైన ‘బేబీ’ మూవీ అందరూ అమ్మాయి కోణంలోనే ఆలోచిస్తున్నారు. కానీ మన సామాన్యుడు ఆటో డ్రైవర్ ‘ఆనంద్’ పాత్రలోని లోతును ఎవ్వరూ గుర్తించలేదు. అసలు చూడాల్సింది.. గుర్తించాల్సింది ఆనంద్ లాంటి భగ్న ప్రేమికుడి మనసు లోతును.. కానీ ఈ మేధావులు, మహిళా అభ్యుదయ వాదులకు ఆనంద్ భగ్న ప్రేమ ఎప్పటికీ కనిపించలేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ‘వైష్ణవి’ ని మోడర్న్ అమ్మాయిగా.. విరాజ్ గాడిని మోసం చేసే యువకుడిగా చూపిస్తున్నారు. సినిమా ఫీల్ గుడ్ అంటున్నారు.
కానీ తన ప్రేయసి.. తనతో ప్రేమలో ఉంటూ.. ముద్దు ఇచ్చి మరీ పక్కోడితో ఎంజాయ్ చేసిందన్న వార్త తెలిసి కూడా అంత గుండెనిబ్బరంతో ఉన్న ‘ఆనంద్’ మనసును ఎవ్వరూ చూడడం లేదు. అసలు చూడాల్సింది బేబీ సినిమాలో ‘ఆనంద్’ క్యారెక్టర్ నే. ఒక్కసారి ఆనంద్ క్యారెక్టర్ లో మనల్ని మనం ఊహించుకుంటేనే తట్టుకోలేని బాధ అదీ.
ఎందుకంటే తన ప్రియురాలు తన చేయిదాటిపోయి వేరొకరి సొంతమైందని తెలిసి కూడా చంపకుండా వచ్చేశాడు. వీడిది అసలు మంచి మనసు. ఆమె ముఖం చూడగానే చంపకుండా ఆ ప్రేమను గుర్తుచేసుకున్నాడు. అదీ అతడి గొప్పతనం.. తను దక్కలేదని.. తనను మోసం చేసిందని తనకు తాను తాగుబోతుగా మారాడు. ఇక తను కనిపించినప్పుడల్లా ప్రియురాలి మోసం కనిపిస్తోందని.. దూరంగా ఉండమన్నాడు కానీ ఆమెకు హాని తలపెట్టలేదు. ఈ కాలంలో మోసం చేసిందంటే దాడులు చేసే వాళ్లు ఉన్న ఈరోజుల్లో ప్రియురాలి చేసిన మోసం తెలిసి కూడా గుండెనిబ్బరంతో తనను తాను శిక్షించుకున్న బేబీ సినిమాలో ‘ఆనంద్ దేవరకొండ’ క్యారెక్టర్ ఈ సినిమాలో అసలు సిసలు హీరో. మనం చూడాల్సింది ఆయన్నే. మగాళ్లు ప్రేమలో విఫలమైతే ఆ బాధ.. ప్రియురాలు మోసం చేస్తే పడే గుండెకోతను అర్థం చేసుకోవాలి. అది సాటి మగాళ్లకు.. ఆ బాధ అనుభవించినోళ్లకు తెలుసు.
ఇక సినిమాను సినిమాగా చూడాలి కాబట్టి ఈ అమ్మాయిల మోసాలు.. అబ్బాయిల ఆవేదనను సమాజంలో జరిగే సహజ ప్రక్రియగా భావించి ఎంజాయ్ చేయాలి. అంతే కానీ ఇంతలా టెంప్ట్ అవ్వకూడదు. దీన్ని ఇలా మనసుకు తీసుకుంటే మాత్రం చాలా లూప్ హోల్స్ కనిపిస్తాయి. అందరూ బేబీలో యువతులు ఎలా చెడిపోతున్నారనేది చూశారు. కానీ ఒక సాటి మగాడి గుండెకోతను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.