
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ‘తిమ్మరుసు’. కరోనాతో షూటింగ్ లు వాయిదా పడి.. ఇండస్ట్రీ మూతపడి థియేటర్లు బంద్ పడి తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ఎత్తివేయడంతో సినిమా షూటింగులు ప్రారంభమయ్యాయి. ఇక విడుదల నిలిచిపోయిన సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు.
సుధీర్ఘ గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో ఈరోజు జులై 30న విడుదలైన మూవీ ‘తిమ్మరుసు’. యంగ్ హీరో సత్యదేవ్ ఇందులో హీరోగా నటించాడు. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా విడుదలైంది. అక్కడి ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.
సత్యదేవ్ లో మంచి విలక్షణ నటుడు ఉన్నాడు. అతడి నటన బాగుంటుందని చాలా మంది చెబుతుంటారు. ఈ క్రమంలోనే శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో అతడు నటించిన ‘తిమ్మరుసు’ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది. ప్రియాంక జువాల్కర్ హీరోయిన్. మహేష్ కోనేరు నిర్మించారు. కన్నడలో సూపర్ హిట్అయిన ‘బీర్బల్’ మూవీకి ఇది రిమేక్ గా వస్తోంది.
అమెరికాలోని దాదాపు 50 చోట్ల ‘తిమ్మరుసు’ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సినిమాకు అనూహ్యంగా భారీ స్థాయిలో స్పందన వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. పాజిటివ్ టాక్ రావడంతో చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా సినిమా సూపర్ హిట్ అంటూ 3 రేటింగ్ ఇస్తున్నారు. ఇదో థ్రిల్లర్ మూవీ అని చెబుతున్నారు. సత్యదేవ్ నటన వన్ మ్యాన్ షోను తలపిస్తోందంటున్నారు. ఇందులో ట్విస్టులు సినిమాపై ఆసక్తి పెంచాయని అంటున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు. యాక్షన్ పార్ట్ కూడా బాగుందని కితాబిస్తున్నారు.
ఓ పాత కేసును రీఓపెన్ చేయించి లాయర్ సత్య దేవ్ ఎలా పరిష్కరించాడన్న కథతో దీన్ని రూపొందించారు. ఈ సినిమా ప్రేక్షకులను అలరించే థ్రిల్లర్ కథ అని చెబుతున్నారు.