AMB Cinemas : హైదరాబాద్ లో అత్యంత ఆధునిక టెక్నాలజీ తో అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ని కలిగించే మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి నిర్మించిన AMB సినిమాస్ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడి థియేటర్ లో వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ ప్రజలు అత్యధికంగా ఈ థియేటర్ లోనే సినిమాలు చూసేందుకు అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి ఈ థియేటర్ లో ఇప్పటి వరకు విడుదలైన సినిమాలలో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాలేంటో ఒకసారి చూద్దాము.
1) కల్కి 2898 AD :
గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రకంపనలు మామూలివి కాదు. ముఖ్యంగా హైదరాబాద్ లోని అన్ని థియేటర్స్ లో ఈ చిత్రానికి అద్భుతమైన థియేట్రికల్ రన్ వచ్చింది. AMB సినిమాస్ లో ఈ చిత్రానికి ఫుల్ రన్ లో దాదాపుగా 4 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
2) #RRR :
ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినది. ఆస్కార్ అవార్డు ని కైవసం చేసుకొని మన తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన ఈ చిత్రానికి AMB సినిమాస్ లో 4 కోట్ల 36 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
3) పుష్ప 2:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం AMB సినిమాస్ లో విజయవంతం గా నడుస్తుంది. వీకెండ్స్ వచ్చిందంటే హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంటుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 4 కోట్ల 18 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ప్రస్తుతానికి కల్కి రికార్డు ని కొట్టడం కష్టమే. ఫుల్ రన్ లో మరో 12 లక్షల రూపాయిలు మాత్రమే వసూలు చేసే అవకాశం ఉందట.
4) దేవర :
#RRR తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ నుండి గత ఏడాది విడుదలైన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి AMB సినిమాస్ లో 2 కోట్ల 26 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
5) సలార్ :
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కనీవినీ ఎరుగని భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి ఫుల్ రన్ లో AMB సినిమాస్ లో రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.