Trivikram- Chiranjeevi: చిరంజీవి డాన్స్, యాక్టింగ్, కామెడీ టైమింగ్ కు మాటల మాంత్రికుడి పంచ్ డైలాగులు, సూపర్ డైరెక్షన్ తోడైతే ఆ సినిమా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అబ్బ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ మంచి సినిమా ప్రకటిస్తే బాగుండు అనుకుంటున్నారు కదా.. ఇది త్వరలోనే జరగనుందట. ఏంటి నిజమా అనుకుంటున్నారా? కానీ డైలామా కూడా ఉందండోయ్.. మరి ఓ సారి కన్నేద్దాం పదండి..
చిరంజీవి హీరోగా నటించిన ‘జై చిరంజీవా’ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాశారు. అప్పటికి ఆయన దర్శకుడిగా మారారు. ఇతర సినిమాలకు దర్శకత్వం వహించారు కానీ చిరంజీవి మీద ఉన్న అభిమానంతో మాటలు రాసి ఇచ్చారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది ఏంటి అనుకుంటున్నారా? త్రివిక్రమ్ మాటలు అందించిన సినిమా 2005లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మెగాస్టార్, మాటల మాంత్రికుడి కాంబినేషన్ కుదరలేదు. ఇప్పుడు కుదురుతుందని టాక్.
ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు త్రివిక్రమ్! ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా టార్గెట్ చేస్తూ ఓ సినిమా లైనులో ఉంది. ఈ రెండిటి మధ్య చిరంజీవితో సినిమా వచ్చే ఛాన్స్ ఉందట. ఇక చిరు విషయానికి వస్తే… 60 ఏళ్లు దాటినా ఇప్పటికే అదే హుషురుగా సినిమాలు తీస్తూ… అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు. 2023 చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ . ఈ సినిమా విడుదలై మాస్ ఆడియన్స్‌ను ఎంతగానో అలరించింది. మరోవైపు ఇదే ఏడాది విడుదలైన ‘భోళా శంకర్’ సినిమా చిరు కెరీర్‌లోనే అతి తక్కువ వసూళ్లును సాధించిన సినిమాగా నిలిచింది. ఏది ఏమైనా ఒక సినిమా బోల్తా పడినా.. చిరు ఇమేజ్‌కు వచ్చిన ఢోకా లేదు.
గతంలో వచ్చిన ఖైదీ సినిమా గుర్తుందా. రీసెంట్ గా వచ్చిన ఖైదీ నెం. 150 కాకుండా చిరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మరో ఖైదీ సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పగ తీర్చుకోవడం కోసం ఈ జన్మ ఎత్తాను.. ప్రేమ కోసం మరో జన్మ ఎత్తుతాను.. అప్పుడు కలుసుకుందాం’ అంటూ ఖైదీ సినిమా ఎండ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఈ డైలాగ్ తర్వాత స్టోరీ వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఖైదీ సీక్వెల్ కోసం సరైన దర్శకుడు దొరికితే సినిమా చేసేందుకు చిరు రెడీగా ఉన్నారట. అయితే ఈ క్రమంలో ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కలిశారని సమాచారం.
ఇటీవలే ఈ విషయంపై చిరు, త్రివిక్రమ్ కలిశారట. ‘ఖైదీ’ సీక్వెల్ బాధ్యతను త్రివిక్రమ్‌కు అప్పజెప్పారట మెగాస్టార్. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే వార్త వైరల్ అవుతోంది. అయితే చిరంజీవి త్రివిక్రమ్ సినిమా వర్కౌట్ అయ్యేలా ఉంది.. అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేస్తున్నాడు అందుకే త్రివిక్రమ్ ఆ ఖాళీ గ్యాప్‌లో చిరంజీవితో వర్కౌట్ చేయాలని చూస్తున్నాడు. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎంతవరకు ట్రాక్ ఎక్కుతుందో చూడాలి. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చిరంజీవిని చూడాలని అభిమానులు కూడా ఆశపడుతున్నారు.
కానీ అభిమానులు కోరుకున్నట్టు ఈ సినిమా రావచ్చు. రాకపోవచ్చు. ఎందుకంటారా? చిరు చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. వాటితో పాటుగా అనిల్ రావిపూడి కూడా ఓ కథ చెప్పి ఒప్పించాడు. ఈ మూడు సినిమాలూ పూర్తయ్యే సరికి 2024 గడిచిపోతుంది. త్రివిక్రమ్ కూడా ఖాళీగా లేడు. గుంటూరు కారం పూర్తవ్వాలి. ఆ తరవాత బన్నీతో ఓ సినిమా ఉంది. ఆ వెంటనే ఎన్టీఆర్‌తోనూ ఓ సినిమా చేయాలి. చరణ్ ఎప్పటి నుంచో.. కాచుకొని కూర్చున్నాడు. ప్రభాస్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయాలని తహతహలాడుతున్నాడు. ఇవన్నీ పూర్తయితే గానీ, చిరుతో సినిమా ఉండదు. మరి అప్పటికీ చిరు సినిమా ఏం అవుతుందో? ఎవరికి తెలుసు అనే ప్రశ్న కొందరిలో మెదలుతుంది..