Chiranjeevi: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి ఒక లెజెండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి స్వశక్తితో ఆయన ఎదిగారు. మరొక హీరో అందుకోలేని రికార్డులు నెలకొల్పారు. దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా చిరంజీవి తెలుగు సినిమాను ఏలారు. చిరంజీవి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఏడు పదుల వయసు దగ్గరపడుతున్నా.. చిరంజీవి అలుపెరగకుండా చిత్రాలు చేస్తున్నారు. గత రెండేళ్లలో చిరంజీవి నాలుగు సినిమాలు చేయడం విశేషం.
చిరంజీవి లైనప్ అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఆయన విశ్వంభర మూవీ చేస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట.. సోషియో ఫాంటసీ చిత్రంగా విశ్వంభర తెరకెక్కిస్తున్నారు. సమ్మర్ కానుకగా విశ్వంభర విడుదల కానుంది. యువ దర్శకులతో పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు చిరంజీవి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడిలతో ఆయన నెక్స్ట్ చిత్రాలు చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగింది.
కాగా ఓ యువ దర్శకుడు చిరంజీవి ఆఫర్ ని తిరస్కరించాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు, బాబీ. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కానీ ఈ చిత్రానికి బాబీ దర్శకుడిగా పని చేయాల్సిందట. ఈ ఆఫర్ మొదట బాబీ వద్దకు వెళ్లిందట. లూసిఫర్ రీమేక్ గురించి మాట్లాడేందుకు బాబీని చిరంజీవి తన ఇంటికి పిలిపించారట. అయితే ఆ ప్రాజెక్ట్ పట్ల బాబీ సుముఖంగా లేడట.
లూసిఫర్ మూవీ బాగుంది సర్. కానీ నేను ఊహించుకున్న చిరంజీవి ఆ కథలో కనిపించడం లేదు. నేను నా కథలో మిమ్మల్ని గొప్పగా చూపించగలను. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో నేను ఫెయిల్ కావడానికి కారణం ఇదే. ఆ చిత్రానికి కథ నాది కాదు. నేను సరిగా డీల్ చేయలేయకపోయాను. కనుక ఈ ప్రాజెక్ట్ నేను చేయలేను, అన్నాడట. కట్ చేస్తే వాల్తేరు వీరయ్య మూవీతో చిరంజీవికి బాబీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాబీకి సైతం మంచి బ్రేక్ వచ్చింది.