Chiranjeevi- Kodandarami Reddy: కొన్ని కాంబినేషన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి- కోదండరామిరెడ్డిలది అద్భుతమైన జోడి. వీరిద్దరూ కలిసి సృష్టించిన అద్భుతాలు, నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. దశాబ్దాలపాటు బాక్సాఫీస్ షేక్ చేశారు. చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రాలు, స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రాలన్నింటికీ ఏ కోదండరామిరెడ్డినే దర్శకుడు. ఖైదీ, అభిలాష, గూండా, దొంగ, ఛాలెంజ్, విజేత, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, ముఠామేస్త్రి… వంటి ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రాలు ఏ. కోదండరామిరెడ్డి చిరంజీవి హీరోగా చేశారు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో పడ్డ ఈ చిత్రాలు ఆయన కెరీర్ కి గట్టి పునాది వేశాయి.

దీంతో ఒకరిపై ఒకరికి ఎనలేమి అభిమానం ఉండేది. అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో దానికి నిదర్శనం. 1984లో రుస్తుం మూవీ షూటింగ్ అవుట్ డోర్ లో నడుస్తుంది. షూటింగ్ గ్యాప్ లో ఏ కోదండరామిరెడ్డి సిగరెట్స్ తీసుకొచ్చి తాను ఒకటి నోట్లో పెట్టుకొని మరొకటి చిరంజీవికి ఇచ్చారు. స్వయంగా ఆయనే వెలిగిస్తున్నారు. ఆ పక్కనే ఉన్న ఆ చిత్ర హీరోయిన్ ఊర్వశి ఆసక్తిగా చూడటం మనం గమనించవచ్చు. ఈ ఫోటో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
వీరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం ముఠామేస్త్రి. 1993లో విడుదలైన ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. ముఠామేస్త్రి తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో మూవీ రాలేదు. గొప్ప మిత్రులైన వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అందుకే సినిమాలు చేయలేదనే ఒక వాదన ఉంది. అలాంటిదేమీ లేదు ఎదురుపడితే పలకరించుకుంటామని ఓ ఇంటర్వ్యూలో కోదండరామిరెడ్డి వెల్లడించారు. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో చిత్రాలు చేసిన కోదండరామిరెడ్డి చిరంజీవితో సినిమాలు తెరకెక్కించలేదు.

ఇంత సుదీర్ఘ విరామం రావడం అంటే మనస్పర్థల వార్తలు నిజమే అనిపిస్తుంది. ఎంత సన్నిహితులైన విడిపోవడానికి ఒక్క మాట చాలు. అలాంటి సంఘటన ఏదో జరిగిందనే గట్టి వాదన ఉంది. ఏది ఏమైనా చిరంజీవి, కోదండరామిరెడ్డి మర్చిపోలేని చిత్రాలు ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగా కోదండరామిరెడ్డి చివరి చిత్రం పున్నమి నాగు(2009). ఆయన కుమారుడు వైభవ్ హీరోగా కొనసాగుతున్నాడు. అతడు కోలీవుడ్ లో సెటిల్ కావడం విశేషం.