Prabhas Kalki : కల్కి 2829 AD చిత్రం విడుదల తేదీ మారిన విషయం తెలిసిందే. మే 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్ 27కి వాయిదా పడింది. చిత్ర నిర్మాతలు ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. మరోవైపు కల్కి బిజినెస్ జోరుగా జరుగుతుంది. కల్కి చిత్రంపై ఉన్న హైప్ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడుతున్నారు. కాగా కల్కి డిజిటల్ రైట్స్ విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతున్నట్లు టాలీవుడ్ టాక్.
ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల డిజిటల్ రైట్స్ కి సంబంధించిన డీల్స్ పూర్తి కాలేదట. కారణం కల్కి నిర్మాతలు డిజిటల్ రైట్స్ కి భారీగా డిమాండ్ చేస్తున్నారట. గతంలో మాదిరి ఓటీటీ సంస్థలు నిర్మాతలు అడిగిన మొత్తం ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. కొన్ని భారీ ప్రాజెక్ట్స్ నిరాశపరచడంతో నష్టాలను చవిచూశారు. దాంతో ఆచితూచి కొనుగోలు చేస్తున్నారు.
కల్కి భారీ బడ్జెట్ మూవీ కావడంతో… హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు మాత్రమే వందల కోట్లు వెచ్చించి డిజిటల్ రైట్స్ పొందగలవు. కాబట్టి ప్రధానంగా ఈ మూడు సంస్థల మధ్య పోటీ ఉండే అవకాశం కలదు. మరి చూడాలి కల్కి డిజిటల్ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో. నిర్మాత అశ్వినీ దత్ దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో కల్కి తెరకెక్కిస్తున్నారు.
కల్కి మూవీలో ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె నటిస్తుంది. దిశా పటాని మరొక హీరోయిన్. కల్కి చిత్రంలో లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నారు. వీరి పాత్రలపై ఆసక్తి నెలకొంది. ద్రోణాచార్యుడు కొడుకు అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ ని పరిచయం చేశారు. యంగ్ అమితాబ్ గా కూడా ఆయన కనిపిస్తాడని సమాచారం. కమల్ హాసన్ పాత్ర పై ఎలాంటి హింట్ లేదు.