Allu Arjun Arrested: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కాసేపటి క్రితమే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి, చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ సంధ్య థియేటర్లో ‘పుష్ప 2 ‘ ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ కారణంగా, థియేటర్ లో తొక్కిసిలాట జరగడం, ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం వంటివి సంచలనం రేపింది. ఈ ఘటన కి కారణమైన సంధ్య థియేటర్ యాజమాన్యం ని పోలీసులు రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేసారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి కానీ, ఇంత తొందరగా అరెస్ట్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. దీనిపై సోషల్ మీడియా లో అభిమానుల నుండి తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ తరుపున న్యాయవాది కాసేపటి క్రితమే హై కోర్ట్ లో లంచ్ మోషన్ పిటీషన్ ని ఫైల్ చేసాడు. దీనిపై కాసేపటి క్రితమే విచారణ జరిపిన హై కోర్టు న్యాయ స్థానం సాయంత్రం 4 గంటలకు కేసు విచారణకు వాయిదా వేసింది. ఈ క్వాష్ పిటీషన్ కి కోర్టు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సంధ్య థియేటర్ యాజమాన్యం డిసెంబర్ 4 ,5 తేదీలకు గాను భారీ బందోబస్తు కావాలని పోలీసులను కోరుతూ ఉత్తరం రాసారు. దానికి సంబంధించిన కాపీలను కాసేపటి క్రితమే విడుదల చేసింది సంధ్య థియేటర్ యాజమాన్యం. కానీ పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఇవ్వడంలో విఫలమైంది. ఫలితంగా ఒక నిండు ప్రాణం బలైంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అల్లు అర్జున్ పై వేసిన కేసు ని కొట్టిపారేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
కాబట్టి అల్లు అర్జున్ అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని, ఆయన నిర్దోషి గా సాయంత్రం లోపు బయటకి వస్తాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరోపక్క తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులూ ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు అనే విషయాన్ని పక్కదోవ పట్టించి, కాసేపు అల్లు అర్జున్ వైపు విషయాన్ని మరలించి, సైలెంట్ గా కేటీఆర్ ని అరెస్ట్ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారని , ఇదంతా కుట్ర అంటూ సోషల్ మీడియా లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ సీఎం పై విరుచుకుపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు సాయంత్రం విచారణలో అల్లు అర్జున్ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ హై కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుందో. ఒకవేళ లంచ్ మోషన్ పిటీషన్ కి కోర్టు ఆమోదం తెలిపితే సోమవారం వరకు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసేందుకు వీలు లేదు.