Star Heroes Fans: టాలీవుడ్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒక్క స్టార్ హీరో ఫ్యాన్ మనశ్శాంతిగా లేడు. పవన్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, బన్నీ, చరణ్ తమ అభిమానులను అసహనం లోకి నెట్టేశారు. గత 24 గంటలుగా పవన్ ఫ్యాన్స్ అసహనం ఆకాశానికి చేరింది. హరీష్ శంకర్-పవన్ కాంబినేషన్ లో తేరి రీమేక్ పై అధికారిక ప్రకటన వస్తుందన్న ఊహాగానాలు మొదలుకావడంతో వాళ్ళ కోపం కట్టలు తెచ్చుకుంది. క్షణాల్లో #WeDontWantTheriRemake అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ స్టార్ట్ చేశారు. హరీష్ శంకర్ కి సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ నుండి అభ్యర్థనలు, డిమాండ్లు, వార్నింగ్ లు వెల్లువెత్తాయి.

ఒక అభిమాని ఏకంగా సూసైడ్ నోట్ రాశాడు. తేరి రీమేక్ ప్రకటిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. నేడు పవన్-హరీష్ మూవీపై క్లారిటీ రావాల్సి ఉండగా అభిమానుల్లో ఆందోళన, మేకర్స్ లో భయం నెలకొంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ విషయానికి వస్తే… ఆదిపురుష్ టీజర్ చూశాక వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరింది. వందల కోట్లతో ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ తో ఈ కార్టూన్ మూవీ ఏంటి సామీ… అంటూ ఓం రౌత్ పై పీకల దాకా కోపం పెంచుకున్నారు.
సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆదిపురుష్ వాయిదా పడింది. ఓం రౌత్ చిత్రానికి రిపేర్స్ చేస్తున్నారు. ఆదిపురుష్ తో ప్రభాస్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ ఇస్తారేమో అని భయపడుతున్నారు. ఇది చాలదన్నట్లు దర్శకుడు మారుతి ప్రాజెక్ట్ వారి కోపం కట్టలు తెంచుకునేలా చేస్తుంది. మహేష్ ఫ్యాన్స్ విషయానికి వస్తే… త్రివిక్రమ్ మూవీపై రోజుకో వార్త వారిని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిన షెడ్యూల్ మధ్యలో ఆపేశారట. స్క్రిప్టులో మళ్ళీ మార్పులు చేశారట. పాన్ ఇండియా మూవీగా మార్చి… ఈ నెల నుండి ఫ్రెష్ గా షూట్ స్టార్ట్ చేస్తున్నారని చెబుతున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విషయంలో కూడా అనేక పుకార్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో SSMB 28 తినడానికి పనికిరాని కిచిడి అవుతుందేమో అని భయపడుతున్నారు.

మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప 2 అప్డేట్ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. పుష్ప పార్ట్ 1 విడుదలై ఏడాది అవుతున్నా సీక్వెల్ పై ఒక్క అధికారిక అప్డేట్ లేదు. అసలు షూట్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు విడుదల చేస్తారు? అనే ప్రశ్నలు వాళ్ళను ఫ్రస్ట్రేట్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ది మరో బాధ. ఎప్పుడో ఏడాది క్రితమే పట్టాలెక్కాల్సిన ఎన్టీఆర్ 30 ఇంకా మొదలు కాలేదు. అలాగే ఎలాంటి అప్డేట్ లేదు. ఆచార్య ఫలితం నేపథ్యంలో కొరటాల హిట్ ఇస్తాడా అనే సందేహాలు వెంటాడుతున్నాయి. ఇక చరణ్ ఫ్యాన్స్ శంకర్ తీరుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఆయన చరణ్ మూవీతో పాటు భారతీయుడు 2 ఏక కాలంలో చిత్రీకరిస్తున్నారు. శంకర్ రెండు పడవల ప్రయాణం బెడిసికొడుతుందేమో అని భయపడుతున్నారు.