Telugu TV channels TRP ratings: అప్పట్లో సాయంత్రం అయితే చాలు ఈటీవీలో ఇది కథ కాదు, వసుంధర, అన్వేషిత, అందం, అంతరంగాలు, మనో యజ్ఞం, శాంతినివాసం వంటి సీరియల్స్ టెలికాస్ట్ అయ్యేవి. ఏళ్లకు ఏళ్లుగా ఈ సీరియల్స్ టెలికాస్ట్ అయ్యి సరికొత్త చరిత్ర సృష్టించాయి. అప్పట్లో సీరియల్స్ అంటే ఈటీవీ అన్నట్టుగా ఉండేది. ఆ తర్వాత జెమినీలో ఋతురాగాలు, కస్తూరి, పిన్ని, మొగలిరేకులు, మర్మదేశం వంటివి సంచలనం సృష్టించాయి. ఒకరకంగా ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఈ రెండు చానల్స్ పోటాపోటీగా తమ ప్రయాణాన్ని కొనసాగించేవి. ఎప్పుడైతే స్టార్ మా అడుగుపెట్టిందో.. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. క్రమక్రమంగా జెమిని తన స్థానాన్ని స్టార్ మా కు ఇచ్చేసింది. ఎంతో సాధన సంపత్తి ఉన్నప్పటికీ ఈ టీవీ రేసులో వెనుకబడిపోయింది. నవ్యతకు దూరం పెట్టడంతో దాని స్థానాన్ని జీ తెలుగు ఆక్రమించింది. దీంతో ఈటీవీ మూడో స్థానంలో.. జెమిని అయిదవ స్థానంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాస్తవానికి ఈ రెండు చానల్స్ కు సీరియల్స్ కొట్టినపిండి. గొప్ప గొప్ప సీరియల్స్ తీసిన చరిత్ర కూడా ఈ రెండు చానల్స్ కు ఉంది. కానీ ఎందుకనో.. నాసిరకమైన సీరియల్స్ తీస్తూ రేటింగ్ విషయంలో పూర్ పెర్ఫార్మెన్స్ నమోదు చేస్తున్నాయి.
తాజా రేటింగ్స్ లో టాప్ 5 సీరియల్స్ స్టార్ మా, జీ తెలుగులోనే టెలికాస్ట్ అవుతూ ఉండటం విశేషం. ఇప్పటికీ కార్తీకదీపం -2 మొదటి స్థానంలో కొనసాగుతోంది. ధారావాహిక చరిత్రలో పార్ట్ -2 గా వస్తున్న చరిత్ర దీనికే సొంతం. విపరీతమైన సాగదీత.. అర్థంపర్థం లేని కథనం ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ సీరియల్ ను ఆదరిస్తున్నారు. దీంతోపాటు సమాన స్థాయిలో రేటింగ్స్ సొంతం చేసుకుంటున్నది ఇల్లు ఇల్లాలు పిల్లలు. బుల్లితెర నటుడు ప్రభాకర్ , సీనియర్ నటి ఆమని ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో గుండె నిండా గుడిగంటలు.. మూడో స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతున్నాయి. కార్తీకదీపం ఈరోజుకి కూడా 11.74 రేటింగ్స్ సాదిస్తోంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా అదే స్థాయిలో రేటింగ్స్ సొంతం చేసుకుంటున్నది. మరో సీరియల్ కూడా 10.74 రేటింగ్స్ తో అదరగొడుతోంది. ఇంటింటి రామాయణం 10.42 రేటింగ్స్ తో దుమ్ము రేపుతోంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న జగద్ధాత్రి 9.34 రేటింగ్స్ తో నాలుగో స్థానంలో.. 9.0 రేటింగ్ తో చామంతి ఐదో స్థానంలో కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే ధారావాహికల పరంగా స్టార్ మా మిగతా చానల్స్ కు అందనంత ఎత్తులో ఉంది. జీ తెలుగు పోటీ ఇస్తున్నప్పటికీ.. దాని సీరియల్స్ 10 కంటే తక్కువగానే రేటింగ్స్ నమోదు చేస్తున్నాయి.
జెమిని, ఈటీవీలో ప్రసారమవుతున్న చానల్స్ పూర్ పర్ఫామెన్స్ ఇస్తున్నాయి. ఈటీవీలో ప్రసారమవుతున్న మనసంతా నువ్వే కాస్త నయంగా ఉంది. అయితే ఆ సీరియల్ రేటింగ్స్ ఐదు ను దాటడం లేదు. ఇక జెమినీలో నాగిని అనే సీరియల్ మాత్రమే కాస్తలో కాస్త బెటర్ గా ఉంది. ఇక మిగతావన్నీ సో సో…పోనీ రియాల్టీ షోలు ఏమైనా బాగున్నాయా అంటే.. అది కూడా లేదు. ఇవాల్టికి ఈటీవీని ఆ బూతు జబర్దస్త్ మాత్రమే బతికిస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్ కాస్త పర్వాలేదు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే న్యూస్ ఈటీవీకి కొండంత బలం. ఇక జెమినీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.