
కరోనా టైమ్ కాబట్టి.. సినిమా వాళ్ళు అందరూ ఖాళీగా కూర్చున్నారు. అయితే, టాలీవుడ్ తెరవెనుక మాత్రం వ్యవహారం వేరే వుందనేది ఇండస్ట్రీ టాక్. బడా నిర్మాతల దగ్గర నుండి నిర్మాతలుగా మారబోతున్న హీరోలు, దర్శకులు అందరూ ఇప్పుడు యంగ్ టాలెంట్ కోసం వేట కొనసాగిస్తున్నారు. కోటి నుంచి మూడు కోట్లలో సినిమాలు తీసి ఇచ్చే, యంగ్ టాలెంట్ డైరెక్టర్స్ కావాలి అని ప్రతి సినిమా అఫీస్ నుండి కబుర్లు అందుతున్నాయి.
ఎలాగూ ఓటిటి మార్కెట్ ఉంది, పైగా శాటిలైట్ మార్కెట్ కూడా ఉంది. అందుకే నిర్మాతలకు మూడు కోట్లల్లో సినిమా తీస్తే మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఈ ఆలోచనతోనే అందరూ ఆల్టర్ నేటివ్ బిజినెస్ గా చిన్న చిత్రాల నిర్మాణం వైపు మళ్లుతున్నారు. చేతుల్లో ఉండే బిజినెస్, రిస్క్ తక్కువ, పైగా హిట్ అయితే వసూళ్లు ఎక్కువ, అందుకే ఇలాంటి సినిమా మనం తీసుకుంటే పోలా? అన్న ఆలోచన మొదలైపోయింది అందరిలో.
పెద్ద బ్యానర్లతో పాటు కొంతమంది పెద్ద దర్శకులు కూడా ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు. ఎలాగూ తమ దగ్గర అసిస్టెంట్స్ ఉన్నారు. వాళ్లల్లో పనికి వచ్చే వాళ్ళను లిస్ట్ చేసి, తమ దగ్గర వున్న లైన్లను ఓటిటి సినిమాలుగా మార్చడానికి కొరటాల శివ, హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్లు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు. సినిమా చేసిన తరువాత వీలైతే మెయిన్ స్ట్రీమ్ లో రిలీజ్ చేసుకోవచ్చు. అలాగే ఓటిటికి కూడా ఇవ్వొచ్చు.
ఎలాగూ పెద్ద దర్శకుల రెమ్యునరేషన్ పది కోట్ల నుంచి పదిహేను కోట్లు వరకూ ఉంది. కాబట్టి ఒక మూడు కోట్లలో సినిమా రెడీ చేస్తే.. వాళ్లకు వచ్చే నష్టం ఏమి లేదు. పైగా మంచి అవుట్ పుట్ తెచ్చుకునే అనుభవం వాళ్లకు ఉంది. అందుకే కొంతమంది బడా దర్శకులు నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే నిర్మాతలు మాత్రం కొత్త తరహా ఆలోచనలు చేసే డైరక్టర్ల కోసం, తమ అన్వేషణ కొనసాగిస్తున్నారు. మరి యంగ్ డైరెక్టర్లు ఇదే సరైన సమయం త్వరపడండి.