Telugu Film Industry: ప్రముఖ లెజండరీ నటుడు కోటశ్రీనివాస రావు(Kota Srinivasa Rao) నేడు తెల్లవారు జామున ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో స్వర్గస్తులైన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ఏడాదికి కనీసం 15 కి పైగా సినిమాలు చేస్తూ వచ్చిన కోటా శ్రీనివాసరావు గత 8 ఏళ్లుగా అనారోగ్యం కారణంగా సినిమాలు చేసే సంఖ్యని బాగా తగ్గించేశాడు. గత మూడేళ్ళుగా పూర్తిగా సినిమాలు మానేసాడు. ఆయన నటించిన చివరి చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఈ నెల 24 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో కోట శ్రీనివాసరావు సన్నివేశాలు ఉంచారో, లేదా ఎడిటింగ్ లో తీసేశారో తెలియదు కానీ, ఒకవేళ ఉంచితే మాత్రం మరోసారి మేమంతా ఆ దిగ్గజ నటుడిని వెండితెర పై చూసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే కోటా మృతి పట్ల సినీ పరిశ్రమ మొత్తం తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
బ్రహ్మానందం అయితే కోటా శ్రీనివాస రావు భౌతిక కాయాన్ని చూసిన వెంటనే వెక్కిళ్లు పెట్టి ఏడ్చిన వీడియో సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) వంటి వారు కోట శ్రీనివాస రావు కి నివాళ్లు అర్పించారు. ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేసిన చిరంజీవి, పవన్ కళ్యాణ్..కోట శ్రీనివాస రావు ఇంటికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి ఘటించారు. అనంతరం మీడియా తో చిరంజీవి మాట్లాడుతూ ‘విలక్షణమైన నటనకు పరిపూర్ణమైన రూపం కోట శ్రీనివాసరావు గారు. ఆయనొక మహానటుడు, లెజండరీ క్యారక్టర్ ఆర్టిస్ట్, మా ఇద్దరి నట ప్రస్థానం ‘ప్రాణం ఖరీదు’ చిత్రం తో మొదలైంది. ఇక్కడ నారాయణమూర్తి ఉన్నాడు, ఆయన కూడా ఆ సినిమాతోనే తన ప్రస్థానం ని ప్రారంభించాడు. సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానం లో మాతో ఆయనకు ముడిపడి ఉన్న అనుభందం వేరు’.
Also Read: Kota Srinivasarao Passed Away: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
‘ఆయన నటనను వెండితెర పై చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోక్స్ కానీ ఎంతో అద్భుతంగా ఉండేది. ఈరోజు కోట శ్రీనివాస రావు గారు షూటింగ్ కి వచ్చారు అని తెలిస్తే, ఉత్సాహం తో వెళ్ళేవాళ్ళం. ఆయన చెయ్యని క్యారెక్టర్స్, చెయ్యలేని క్యారెక్టర్స్, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అలాంటి పరిపూర్ణమైన నటుడు నేడు మన మధ్య లేకపోవడం తెలుగు సినిమా చేసుకున్న దురదృష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ ‘కోటశ్రీనివాస రావు గారి మరణ వార్త చాలా బాధని కలిగించింది. అందరికీ ఒక కుటుంబ సభ్యుడు లాంటి వాడు, ఏ అభిప్రాయాన్ని అయినా నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి, ఆయన లేని లోటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరూ పూడవలేనిది’ అంటూ చెప్పుకొచ్చాడు.
