Tammareddy Bharadwaj: పూరిజగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న విడుదలయింది. ఈ సినిమా ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో భారీ అంచనాలు రావడంతో సినిమా బంపర్ హిట్టు కొడుతుందని అనుకున్నారు. కానీ థియేటర్లోకి వెళ్లేసరికి ఫ్యాన్స్ హర్టయ్యారు. అనుకున్న విధంగా సినిమా లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. ఈ సినిమా ఫెయిల్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల మధ్య వివాదం నెలకొంది. వీరంతా కలిసి తాము నష్టపోయిన డబ్బులు పూరి జగన్నాథ్ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. దీనిపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘లైగర్’ సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ చేసిన పిక్స్, గ్లిమ్స్ తో యూత్ లో ఎమోషన్స్ పెంచాయి. బాక్సింగ్ నేపథ్యం ఉండడంతో పాటు మాస్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో కొందరు డిస్డ్రిబ్యూటర్లు ఈ సినిమాను రేటు ఎక్కువైనా కొనుగోలు చేశారు. మరికొందరు సినిమాకు వచ్చిన ఫాలోయింగ్ చూసి అధిక డబ్బులు వెచ్చించి మరీ కొన్నారు. అయితే ఆ తరువాత సినిమా డిజాస్టర్ కావడంతో నిరాశ చెందారు. ట్రైలర్లో చూపిన విధంగా సినిమా లేదని కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేస్తున్నారు. దీంతో తమ నష్టానికి పూరినే బాధ్యుడని ఆరోపిస్తున్నారు.
అయితే ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత పూరి జగన్నాథ్ కు లేదన్నారు. ‘గతంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘నేనింతే’ సినిమా విషయంలో కూడా డిస్ట్రిబ్యూటర్లు ఇలాగే ధర్నా చేశారు. కానీ కొన్ని రోజుల తరువాత వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు ‘లైగర్’ విషయంలోనూ అదే ఆందోళన చేస్తున్నారు.

‘పూరి జగన్నాథ్ చెప్పిందే చేశారు. ఆయన ఓ రేటును ఫిక్స్ చేసి.. అదే రేటుతో మార్కెట్లోకి తెచ్చారు. ఆయన ఎవరి వద్దకు వెళ్లి సినిమా కొనమని అడగలేదు. హీరో విజయ్ దేవరకొండ నటించిన గత చిత్రాల మార్కెట్ వాల్యూ చూసి అంచనా వేసుకొని ‘లైగర్’ను కొనుగోలు చేయాల్సిందని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ రేటు పెట్టి సినిమా కొంటే దానికి పూరి జగన్నాథ్ ఎందుకు బాధ్యుడవుతారు..? సినిమాను కొనేటప్పుడే ఆలోచించాలి.. అని తమ్మారెడ్డి అన్నారు.