TVK Party Election Symbol: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) అభిమానులకు పండుగ లాంటి వార్త. త్వరలో తమిళనాడు లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విజయ్ స్థాపించిన TVK పార్టీ కి విజిల్ (ఈల) గుర్తుని కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గతం లో మనకి విజిల్ గుర్తు ని చూడగానే జయప్రకాశ్ నారాయణ ‘లోక్ సత్తా’ పార్టీ గుర్తుకు వచ్చేది. అప్పట్లో డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ పార్టీ కి తెగ ప్రచారం చేశారు. అలా మన తెలుగు ప్రజల్లో విజిల్ పార్టీ గుర్తుండిపోయింది. ఇప్పుడు తమిళం లో TVK కి ఈ గుర్తు రావడం పై విజయ్ మరియు ఆ పార్టీ నాయకులూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాస్ జనాలకు బాగా దగ్గరయ్యే విధంగా ఈ గుర్తు లభించడం మేము చేసుకున్న అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోపక్క విజయ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ కార్యకలాపాలను రూపొందించాడు. గత మంగళవారం చెన్నై లో విజయ్ ఎన్నికల ప్రచార కమీటీని ఏర్పాటు చేసి తొలి మీటింగ్ ని నిర్వహించాడు. అంతే కాదు ఆ పార్టీ మ్యానిఫెస్టో కి సంబంధించిన చర్చ కూడా ఆరోజు జరిగిందట. సామజిక న్యాయం, పారదర్శకతలకు మ్యానిఫెస్టో లో పెద్ద పీట వెయ్యాలని విజయ్ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ‘ప్రజా రాజ్యం’ పార్టీ ని సామజిక న్యాయం నినందంతో స్థాపించాడు. ఆరోజుల్లో ఈ నినాదం పెద్ద ప్రకంపనలే సృష్టించింది. ఇప్పుడు విజయ్ కూడా అదే నినాదంతో ముందుకు రావడం గమనార్హం. తమిళనాడు రాష్ట్రము లో ఏప్రిల్ నుండి మే మధ్య కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. విజయ్ TVK పార్టీ తో పాటు,మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఏప్రిల్, మే నెలలు టార్గెట్ చేసుకొనే తమ ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
ఇక విజయ్ ఈ నెల 26 నుండి క్షేత్ర స్థాయిలో పర్యటించబోతున్నాడు. ప్రస్తుతానికి విజయ్ ఏ పార్టీ తో పొత్తు పెట్టుకోలేదు. కానీ బీజేపీ, AIDMK పార్టీలు విజయ్ తో పొత్తు పెట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండు మూడు సార్లు చర్చలు కూడా జరిగాయి. విజయ్ ఈ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అదే కనుక జరిగితే 2024 ఎన్నికల్లో మన ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ఎలాంటి సునామీ సృష్టించిందో, రాబోయే ఎన్నికల్లో కూడా ఈ కూటమి అలాంటి సునామీ ని సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. అలా కాకుండా విజయ్ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే మాత్రం పెద్దగా ప్రభావం ఉండదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.